సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ప్లాపులు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు హిట్ స్టేటస్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. ఆ కోవలోకే వస్తుంది ‘అర్జున్’ సినిమా. మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘ఒక్కడు’ అనే చెప్పాలి. ఆ టైంకి ‘ఒక్కడు’ ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ‘ఇలాంటి సినిమాని నేనెందుకు నిర్మించలేదా?’ అని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వంటి వారు బాధపడుతుంటారు.
ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మహేష్ బాబు – గుణశేఖర్ కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? ‘అర్జున్’ పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి.
2004 ఆగస్టు 18న ‘అర్జున్’ సినిమా రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ టైంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీయని హీరోయిన్ గా తీసుకున్నారు. ‘తొలిప్రేమ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ఇందులో మహేష్ అక్క పాత్రలో నటించారు. పద్మాలయ స్టూడియోస్ లో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ వేశారు. అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని ప్రమోట్ చేసుకున్నారు. అయితే రిలీజ్ రోజున సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి.. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. కమర్షియల్ గా బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు. దాదాపు 25 కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది. కానీ బ్లాక్ బస్టర్ కాంబో నుండి ఆశించే ఫలితం ఇది కాదు కదా. ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
సినిమా కథ పాతదే అయినా కథనం కొత్తగా డిజైన్ చేశారు దర్శకులు గుణశేఖర్. కానీ అది ఆడియన్స్ కి కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. కాసేపు ప్రజెంట్లో.. మరి కాసేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇలా సినిమా సాగడం వల్ల ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోయారు.