‘మీటూ’ అంటూ ఎంతో మంది నటీమణులు తమకు జరిగిన లైంగిక దాడులను మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. తనుశ్రీ దత్తా మొదలు పెట్టిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమకు జరిగిన సంఘటనలు, లైంగిక దాడులు మరో నటికి జరగకూడదు అంటూ మీడియాలోనూ..అలాగే సోషల్ మీడియాలోనూ తెలుపుతూ వచ్చారు. అయితే వీరు చెప్పిన వాటిలో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ ఈ ఆరోపణలు చేసిన తర్వాత మాత్రం వీరికి అవకాశాలు రావడం లేదు.
ఈ లిస్ట్ లో కన్నడ నటి శృతి హరిహరన్ కూడా ఉంది. హీరో అర్జున్ ఓ చిత్రం షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని గతంలో శృతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అర్జున్ పై కేసు కూడా పెట్టింది శృతి. అయితే ఆమె ఆరోపణలని అర్జున్ ఖండించడం, అతడు కూడా ఆమె పై పరువునష్టం దావా వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవు. ఈ విషయం పై శృతి మాట్లాడుతూ.. ” ‘మీటూ’ వ్యవహారాలకు ఎలాంటి ఆధారాలు ఉండవు. మనం ధైర్యంగా పోరాటం చేయాలి. నేను కూడా అదే చేస్తున్నా అంటూ శృతి చెప్పుకొచ్చింది. ‘మీటూ’ కామెంట్స్ తర్వాత నాకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదు. అయినా కూడా నాకొచ్చిన నష్టం లేదు. ప్రస్తుతం నేను భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. నా పై జరిగిన వేధింపులని బయట పెట్టినందుకు నాకు ఎలాంటి సిగ్గు లేదు. పైగా గర్వంగా కూడా ఉంది. నాకు జరిగిన వేధింపులు మరో నటికి జరగకూడదు. అందుకే నటీమణులు ఎలాంటి సంఘటనని అయినా ధైర్యంగా ప్రతిఘటించాలి” అంటూ చెప్పుకొచ్చింది.