తెలుగు చిత్ర పరిశ్రమపై మొదటి నుంచి ఇతర భాషా చిత్రాల ప్రభావం ఉండేది. ఆ సినిమాల స్పూర్తితో ఇక్కడ సినిమాలు తీసేవారు దర్శకనిర్మాతలు. అక్కడ హిట్ అయిన ఫార్ములా కాబట్టి స్టార్ హీరోలు ఒకే చెప్పేవారు. ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే జరుగుతోంది. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే.. అసలు సినిమాను ఎక్కువమంది చూడడమే. నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో పరభాషా సినిమాలపై అవగాహనా పెరుగుతోంది. దీంతో తెలుగు సినిమాలు కాపీ కథతో తెరకెక్కుతున్నాయనే ముద్ర పడిపోతోంది. రీసెంట్ గా వచ్చిన అజ్ఞాతవాసి వల్ల ఈ విమర్శలు పెరిగిపోతున్నాయి. రచయిత వక్కంతం వంశీ డైరక్టర్ గా మారి చేస్తున్న నా పేరు సూర్య కూడా కాపీ కథ అని కొంతమంది చెబుతున్నారు. 2002లో “ఫైండింగ్ ఫిష్” అనే నవల స్ఫూర్తిగా తీయబడిన “ఆంట్వోన్ ఫిషర్” ఆధారంగానే వక్కంతం వంశీ కథ అల్లుకున్నట్లు వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
“నిగ్రహం అనే పదానికి అర్థమే తెలియని ఒక యువకుడు అతని కోపం కారణంగా సైన్యంలో కొన్ని శిక్షలకు గురవుతాడు. అతని ఆవేశం, కోపంపై ఉన్న ఫిర్యాదులతో ఒక సైక్రియాటిస్ట్ వద్దకు అతన్ని పంపిస్తారు. అతడి వద్ద ఆ యువకుడుని వైద్యం చేయించుకొమంటారు. ఆ సైక్రియాటిస్ట్ ఆ యువకుడి తండ్రి కావడం, అతడు ఆ యువకుడుకి ఎటువంటి జబ్బు లేదు అని క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం ఆ హాలీవుడ్ మూవీలోని ట్విస్ట్. ఈ కథకు దేశభక్తిని జోడించి వక్కంతం వంశీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ కథలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ మూవీకి తిప్పలు తప్పేలా లేవు.