Bigg Boss: బిగ్‌బాస్‌ విషయంలో న్యాయస్థానం సీరియస్‌.. ఏమవుతుందో?

రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్‌బాస్‌ కార్యక్రమం ప్రసారాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ‘బిగ్‌బాస్‌’ వ్యవహారం చాలా ముఖ్యమైన విషయమని, కేంద్రం దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంలో కేంద్రం ఇప్పటివరకు స్పందించకపోవడం న్యాయస్థానం పేర్కొంది.

బిగ్‌బాస్‌ షో తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున, స్టార్‌ మా ఎండీ, ఎండమోల్‌ ఇండియా డైరెక్టర్‌, సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌, ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. హింస, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలా బిగ్‌బాస్‌ షో ఉందని పేర్కొంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త అయితన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో ఇటీవల పిల్‌ దాఖలు చేశారు.

అలాంటి ఈ షోను ఆపేయాలని ఆయన పిల్‌లో కోరారు. పిటిషనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని ఈ సందర్భంగా న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి షోలను రాత్రి 11 నుండి ఉదయం 5లోపు ప్రసారం చేయాలని న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి ప్రస్తావించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా..

చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందని పిటిషన్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ వాదనలు విన్న కోర్టు… తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సెన్సార్‌షిప్‌ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్‌ చెబుతున్న కారణంగా.. షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ జరిపి.. షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus