Crazxy Review in Telugu: క్రేజీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సోహం షా (Hero)
  • నిమిషా సజయన్ (Heroine)
  • టిను ఆనంద్, శిల్పా శుక్లా తదితరులు.. (Cast)
  • గిరీష్ కోలి (Director)
  • సోహం షా, ముఖేష్ షా, అమిత షా, ఆదేశ్ ప్రసాద్ (Producer)
  • జెస్పర్ (Music)
  • సునీల్ - కుల్దీప్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 28, 2025

కారణాలు ఏమైనా 2018లో “తుంబాడ్” అప్పటికి ఫ్లాప్. అయితే రీరిలీజ్ లో 38 కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దాంతో సోహం షా మీద గౌరవం కూడా పెరిగింది. దాంతో సోహం షా తదుపరి చిత్రమైన “క్రేజీ” మీద విశేషమైన అంచనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ మరింత ఆసక్తి రేపాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Crazxy Review

కథ: హాస్పిటల్లో తన పూర్తిస్థాయి ప్రమేయం లేకుండా జరిగిన ఓ తప్పు కారణంగా ఓ పేషెంట్ మరణిస్తాడు. ఆ కేస్ కారణంగా ఎక్కడ తన డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందో అనే భయంతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు డాక్టర్ అభిమన్యు (సోహం షా). ఆ సెటిల్మెంట్ కోసం 5 కోట్ల రూపాయల క్యాష్ తీసుకొని వెళ్తుండగా..

తన కూతుర్ని కిడ్నాప్ చేశానంటూ ఒకడు ఫోన్ చేస్తాడు, 5 కోట్ల రూపాయలు ఇస్తే వదిలేస్తానని డిమాండ్ చేస్తాడు. కేస్ సెటిల్ చేసుకోవాలా? కూతుర్ని కాపాడుకోవాలా? అనే మీమాంసలో ఉన్న అభిమన్యు ఏ దారి ఎంచుకున్నాడు? ఆ దారిలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? గెలిచాడా లేక ఓడాడా? అనేది “క్రేజీ” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో కనిపించేది సోహం షా ఒక్కడే. 93 నిమిషాల సినిమాలో దాదాపు 92 నిమిషాలు తెరపై సోహం షానే ఉంటాడు. చెప్పాలంటే ఈ చిత్రం సోషం షా ఏకపాత్రాభినయం అని చెప్పాలి. చాలా ఎమోషన్స్ ను చాలా కంపోజ్డ్ గా తెరపై పండించాడు. ముఖ్యంగా కార్ టైమ్ మార్చుతూ, ఆపరేషన్ టేబుల్ మీద డాక్టర్ ను గైడ్ చేస్తూ, కన్న కూతురు ఆరోగ్య సమస్యను హ్యాండిల్ చేస్తూ.. అంత టెన్షన్ లోనూ గంభీరంగా ఉండడాన్ని తెరపై పండించిన విధానం ప్రశంసనీయం. శిల్పా శుక్లా, నిమిషా సజయన్, టిను ఆనంద్ తదితరులు కేవలం తమ వాయిస్ తోనే అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమా మొత్తం కారులోనే ఉంటుంది. రకరకాల సందర్భాల్లో రకరకాల యాంగిల్స్ లో మూడ్ ను బట్టి ఫ్రేమ్స్ పెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అన్నిటికంటే.. కార్ చుట్టూ పెట్టిన ట్రాలీ షాట్ భలే థ్రిల్ చేస్తుంది. కొంత గ్రీన్ మ్యాట్, కొంత ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసినప్పటికీ.. ఎక్కడా అసహజత్వం అనేది కనిపించలేదు. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ టీమ్ ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే.

దర్శకుడు గిరీష్ కోలి “క్రేజీ” సినిమాను ఓ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనుకున్నాడు. 93 నిమిషాల సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేదు. ప్రతి ఫ్రేమ్ & సీన్ ను చక్కగా హ్యాండిల్ చేశాడు. అయితే.. 89 నిమిషాల పాటు బిల్డ్ చేసిందంతా.. చివర్లో చాలా సింపుల్ & కన్వీనియెంట్ గా ఎండ్ చేసిన విధానం అలరించలేకపోయింది. ఈ తరహా ఎండింగ్ అనేది ఎవరూ ఊహించకపోయినప్పటికీ.. ఎందుకో సంతృప్తినివ్వలేకపోయింది. అందువల్ల దర్శకుడిగా ఆకట్టుకున్నా.. కథకుడిగా అలరించలేకపోయాడు.

విశ్లేషణ: 2018లో పిహు అనే సినిమా రిలీజైన విషయం చాలామందికి తెలియదు. కానీ.. ఆ సినిమా ఓటీటీలో చూసి చాలామంది షాక్ అయ్యారు. ఒకరకైమైనా ఫోబియా క్రియేట్ చేస్తుందా చిత్రం. “క్రేజీ” కూడా ఆ తరహా ప్రయత్నమే. అయితే.. ఎండింగ్ అనేది షాక్ ఇవ్వకపోగా.. ఇందుకోసమా అనే నిరాశ కలిగిస్తుంది. కానీ.. సినిమా మేకింగ్ ప్రాసెస్ కానీ, సోహం షా నటన కానీ, సినిమాటోగ్రఫీ వర్క్ కానీ కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

ఫోకస్ పాయింట్: పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సోహం షా ఏకపాత్రాభినయం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus