భారత సినీ పరిశ్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ రూపొందించే పనులు ఇటీవల వేగం పుంజుకున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండింట్లో రూపొందించాలన్న ప్రకటనలతో ఓ ఆసక్తికర పోటీ మొదలైంది. ఒకవైపు ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) సమర్పణలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రణాళికలు జరుగుతున్నట్టు టాక్ వస్తుండగా, మరోవైపు బాలీవుడ్ సూపర్ కాంబో ఆమీర్ ఖాన్ (Aamir Khan) – రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani)ఇప్పటికే స్క్రిప్ట్ దశను దాటి ముందుకు వెళ్తోంది.
అయితే ఈ బయోపిక్ ఎవరికి అధికారిక అనుమతి ఉందన్న అంశంపై తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనతో ఇప్పటివరకు రాజమౌళి (Rajamouli) టీమ్ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వెలువడిన వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటిస్తాడన్న ప్రచారం ఉన్నా, అది పూర్తి అర్థం లేనిదని ఆయన స్పష్టం చేశారు. పైగా, నాలుగేళ్లుగా బాలీవుడ్ టీమ్ తనతో కనెక్షన్ లో ఉందని చెప్పడం ద్వారా, అసలు బయోపిక్ రూపొందించబోయేది ఏ దిశలో సాగుతుందో స్పష్టత ఇచ్చారు.
ఆమీర్ ఖాన్ టీమ్ నుంచి ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని పొందుతున్నామని, వాళ్లు చేసిన పరిశోధనలు, స్క్రిప్ట్ వర్క్, ప్రొఫెషనలిజం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. రాజ్ కుమార్ హిరాణీ టీమ్ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గడిచిన మూడేళ్లుగా తనను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారని, తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. దాదాసాహెబ్ పాత్రలో ఆమీర్ ఖాన్ నటించనున్నాడన్న విషయం గురించి మాట్లాడుతూ, అతను పాత్రకు న్యాయం చేయగలుగుతాడన్న నమ్మకం ఉందన్నారు.
దాదాసాహెబ్ భార్య సరోజినీ పాత్రకు విద్యాబాలన్ (Vidya Balan) సరైన ఎంపిక అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందట. బాలీవుడ్ స్థాయిలో రూపొందబోయే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా, ఇప్పుడు ఈ బయోపిక్ అధికారికంగా బాలీవుడ్ హస్తాల్లోకి వెళ్లిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలుగులో వచ్చిన ప్రచారం మాధ్యమాల్లో ఊహాగానంగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.