సినీ కార్మికులు, వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ద‌గ్గుబాటి ఫ్యామిలీ రూ. 1 కోటి ఆర్థిక సాయం!

క‌రోనాపై పోరాటంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్ర‌మిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌ కోటి రూపాయ‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. రోజువారీ వేత‌నంతో ప‌నిచేసే సినీ కార్మికులు నిత్యావ‌రాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌నీ, వాళ్ల‌ను ఆదుకోవ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించి, వారికి ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌నీ సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా తెలిపారు.

అలాగే త‌మ జీవితాల‌కు ప్ర‌మాదం అని తెలిసినా నిత్యం రోగుల‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ వారి ఆరోగ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తూ వ‌స్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఈ సంక్షోభ కాలాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లంద‌రూ విధిగా పాటించాల‌ని సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా కోరారు. అత్య‌వ‌స‌రం అయితేనే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, గుంపులుగా మాత్రం వెళ్ల‌వ‌ద్ద‌ని వారు చెప్పారు. అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ, ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రిస్తూ క‌రోనాపై పోరాటంలో విజ‌యానికి తోడ్ప‌డాల‌ని సురేశ్‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

సుధీర్ బాబు

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర – రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు త‌మ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ హీరో సుధీర్ బాబు కూడా ముందుకొచ్చారు. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు విర‌ళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో ల‌క్ష రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హా నిధికి మ‌రో లక్ష రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి అందించ‌నున్నారు. దేశ ప్ర‌ధాని పిలుపు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ కి త‌న సంపుర్ణ మ‌ద్ధ‌త్తు తెలిపిన సుధీర్ బాబు, ఇంటి ద‌గ్గ‌ర ఉంటూనే ఫిట‌నెస్ ని మెయింటైన్ చేయాలో వీడియోలు చేసి విడుద‌ల చేశారు. అలానే త‌న అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు హెల్తీ టిప్స్ ఇస్తున్నారు సుధీర్ బాబు. ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఇలాంటి విప‌త్క‌ర పరిస్థిత్తుల్ని సైతం లెక్క చేయ‌కుండా మ‌న‌కోసం ప‌ని చేస్తున్న ఎందరో డాక్ట‌ర్స్, పోలీస్ అధికారులు, మున్సిప‌ల్ అధికారులు త‌దిత‌రుల‌కు కృతజ్ఞ‌తలు తెలుపుతున్నాను. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవాలంటే బ‌య‌ట‌కు రాకుండా ఇంటిలో ఉండ‌ట‌మే అన్ని విధాల సురిక్ష‌తం. ఇలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌కు మ‌నంద‌రం స‌హ‌క‌రించాల‌ని త‌న అభిమానుల‌కు, తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లకు విజ్ఞప్తి చేశారు సుధీర్ బాబు.

నిర్మాత సి. అశ్వినీద‌త్

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం ప్ర‌ముఖ నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన అశ్వినీద‌త్‌.. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోరారు. కుటుంబాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుప‌నేది లేకుండా ప్ర‌జ‌లకు సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. వాళ్ల శ్ర‌మ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌నీ, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

అల్లు అర్జున్

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావ‌త్ భార‌త‌దేశం న‌డుం బిగించింది. దేశ ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌ణ మేర‌కు 21 రోజులు పాటు ప్ర‌జ‌లంతా ఇల్ల‌కే పరిమ‌త‌మ‌వ్వ‌డానికి సిద్ధ‌మైయ్యారు. ఈ నేప‌థ్యంలో ఎటువంటి ప‌నులులేకఇల్లు గడిచే పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అలానే ఎందరో పోలీస్ అధికారులు, డాక్టర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు, శానిటేషన్ వర్కర్లు ఇలా ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు. ఇక ఇలాంటి విప‌త్తులు వ‌చ్చిన ప్ర‌తిసారీ సాయానికి చిత్ర ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ముందుంటుంది.

ఈ పంధాలోనే తాజాగా క‌రోనా పై పోరాటానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలకు త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు మ‌రో 50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మ‌రో 25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేర‌ళ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు 25 ల‌క్ష‌లు, చెన్నై వ‌ర‌ద‌లు వ‌చ్చిప్ప‌డు 25 ల‌క్ష‌లు విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేశ ప్ర‌ధాని మోడీ గారు రాష్ట్రా ముఖ్య‌మంత్రుల ఆదేశాలు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ ని మనంద‌రం క‌చ్ఛితంగా పాటిద్ధాం. మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లంతా ఇల్ల‌కే పరిత‌మై క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి, ఈ ఘోర విప‌త్తు నుంచి అంద‌రం బ‌య‌ట‌ప‌డాల‌ని అన్నారు.

హారిక అండ్ హాసిని అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా మహమ్మారివల్ల భయాందోళనలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

ప్రభాస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారత దేశం లో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా పై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీ ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.

దర్శకుడు సుకుమార్

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.

ఎన్టీఆర్:

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు.

రామ్‌చ‌ర‌ణ్‌:

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌రోనా నిర్మూలనా చర్యలకు రూ.70 ల‌క్షలు విరాళ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ తొలి ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కరోనా నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేద్రమోదీగారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌గారు, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిగారు తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయం. బాధ్య‌త గ‌ల పౌరుడిగా ప్ర‌భుత్వాలు సూచించిన నియ‌మాల‌ను పాటించాల‌ని కోరుతున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు రామ్‌చ‌ర‌ణ్‌. క‌రోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్ష‌లు విరాళం ఇచ్చినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కు త‌న బాబాయ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్ ద్వారా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

త్రివిక్రమ్:

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన‌ చేశారు.

అనిల్ రావిపూడి:

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని కోరారు.

సాయితేజ్‌:

కరోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రభుత్వాలకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. తాజాగా సుప్రీమ్ హీరో సాయితేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌లు విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ‘‘మనం ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్ష‌ల విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి’’అని తెలిపారు సాయితేజ్‌

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus