పైరసీ భూతం నిర్మాతలకు, హీరోలకు కునుకు లేకుండా చేస్తుంది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే నెట్ లో విడుదల చేస్తూ నిర్మాతలకు కోట్లలో నష్టాలు మిగుల్చుతున్నారు. పైరసీని అదుపుచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుబాటులో ఉన్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ పైరసీ మాఫియా నిర్మాతలకు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతుంది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులకే బహిరంగంగా పైరసీ సీడీలు రోడ్లపై అమ్మేస్తున్నారు. పైరసీ నేరం అనే ఆలోచన కూడా జనాల్లో లేకపోవడం ఇది ఎంతగా జనాల్లో చొచ్చుకుపోయిందో అర్ధం అవుతుంది.
ఇక రజిని నటించిన దర్బార్ విడుదలైన రెండు రోజులలో హెచ్ డీ ప్రింట్ నెట్ లో ప్రత్యక్షం అయ్యింది. అలాగే మధురైలో ఓ ప్రైవేట్ టీ వీ ఛానల్ దర్బార్ మూవీని ప్రసారం చేయడం సదరు నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఈనెల 12న శరణ్య అనే టీవీ ఛానెల్ దర్బార్ మూవీని ప్రసారం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దర్బార్ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆ టీవీ ఛానల్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతుంది. అలాగే కొందరు ఉద్దేశపూర్వకంగా దర్బార్ పైరసీ వీడియో లింక్ వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను నిర్మించిన నిర్మాతలకు పైరసీ తలనొప్పిలా తయారైంది. వందల కోట్లు పెట్టి తీస్తున్న స్టార్ హీరో సినిమాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.