63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు సాధించగా, రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘కంచె’ ఉత్తమ పాంతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’తొలిసారి జాతీయ అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించేలా చేసిన చిత్రమిది.
అలాగే రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు పట్టం కట్టిన సినిమా. ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని , ప్రభాస్, రానా, కీరవాణి సహా యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు, అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకున్న కంచె చిత్రానికి కూడా నా అభినందనలు. ఈ కంచె చిత్రానికి సంబంధించి గతంలో ఉన్నట్టు ఎట్మాస్పియర్ ను క్రియేట్ చేయడంలో క్రిష్ సఫలీకృతుడయ్యాడు. దర్శకుడు క్రిష్, వరుణ్ తేజ్ సహా యూనిట్ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’అన్నారు.