పదిహోను రోజులు క్రితం అనుకుంటా… ఓ పాట వచ్చింది. తొలి చూపులోనే కుర్రకారును ప్రేమలో పడేసింది. ఇప్పుడు కవర్ సాంగ్‌లతో యువత ఆ పాటను రకరకాలుగా మనకు వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. ఆ పాటేంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆఁ.. అదే ‘సారంగ దరియా’.శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవి ఆడిన వావ్ అనిపించిన ఈ పాట ఇది. ఈ పాటను ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పిన వివరాలతో పాటను ఆయన మాటల్లోనే డీకోడ్ చేస్తే…
సారంగ దరియా అంటే సారంగి వాయించే అమ్మాయి అని అర్థమట. ‘ఆ అమ్మాయి కుడి,ఎడమ భుజాల్లో కడవెత్తుకుని ఓ ఏజెన్సీ సంతలో(ఎజెంటు) కొన్న గుత్తెపు(బిగువైన) రైకతో వెళ్తోందట. ఆమె అందగత్తేకానీ, అంత సులభంగా దక్కే అమ్మాయి కాదు’…ఇదీ ఆ జానపద కవి హృదయం. ఆ భావాన్నే సుద్దాల.. హీరోయిన్‌కు తగ్గట్టు చరణాల్లో డెవలప్ చేసి రాశారట. హీరోయిన్ల అందం, చందం గురించి చాలామంది పాటలు రాశారు.. దానికి భిన్నంగా సుద్దాల ఈ పాటలో ‘కాళ్లకు ఎండీ గజ్జెల్ లేకున్నా నడిస్తె గల్‌గల్.. కొప్పులొ మల్లే దండల్ లేకున్నా చక్కిలి గిల్‌గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితె వస్తై మురిపాల్..’ అంటూ రివర్స్ స్టయిల్ పొగడ్తతో పాట రాశారు.
ఇక రెండో చరణం విషయానికొస్తే… ఆ అమ్మాయి అందానికి ఇంకా వివరిస్తూ… ‘తెల్లగా ఉన్న నా చొక్కా కూడా తన జడతగిలితే నల్లగా ఐపోతుంది.. అంతటి నలుపు తన కురులనే’ అర్థం వచ్చేలా ‘రంగేలేనీ నా అంగీ జడ తాకితే ఐతది నల్లంగి’ అని పెట్టారు. ‘మాటల ఘాటూ లవంగీ, మర్లపడితె (తిరగబడితే) అది సివంగి. తీగలు లేనీ సారంగీ.. వాయించబోతె అది ఫిరంగి’ అని అందంగా ముగించారాయన. చదివారుగా… పాటలోని కీలక పదాలు, మాటల వెనుక అర్థం ఇదీ.
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!