జీవితం అన్నాక డిప్రెషన్ సహజం అంటుంటారు. అయితే అది మనిషి జీవితాన్ని కబలించే ప్రయత్నం చేస్తే… ఎంత బలంగా ఎదురొడ్డుతారు అనేదే ఇక్క పాయింట్. అలా డిప్రెషన్‌ను డిఫెండ్ చేసి లైఫ్‌లో ఉన్నత స్థానానికి వెళ్లిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అందులో దీపికా పదుకొణె ఒకరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన దీపిక… హాలీవుడ్‌లోనూ తన ప్రతిభ చాటింది. ఇటీవల ఓ కార్యక్రమంలో తన డిప్రెషన్ గురించి వివరించింది. దీపిక 2014లో ఎక్కువగా డిప్రెష్ అయ్యిందట.
ఎప్పుడూ జీవితంలో ఏదో వెలితి ఉంది అనిపించేదట. ఏ పనీ చేయాలనిపించేది కాదట. బయటికి వెళ్లాలని, ఎవరితోనైనా మాట్లాడాలని గానీ అనిపించేది కాదట. ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండేదట. అలాంటి సమయంలో ఓసారి చనిపోదాం అని కూడా అనుకుందట. అలాంటి సమయంలో ఆమె తల్లిదండ్రులు ఒకసారి బెంగళూరు నుండి ముంబయికి వచ్చారట. కొన్ని రోజులు ఉండి తిరిగి వెళ్లిపోతుంటే.. ఎయిర్‌పోర్ట్‌లో ఏడ్చేసిందట దీపిక. అది చూసిన వాళ్ల అమ్మ దీపిక మానసిక ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని గ్రహించారట.
దీపికను వెంటనే సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారట. అలా కొన్ని రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత దీపిక తిరిగి సాధారణ మనిషిలా మారారట. అయితే డిప్రెషన్ నుంచి కోలుకున్నాక.. ఆ బాధను జీవితాంతం మర్చిపోలేం అని చెప్పింది దీపిక. ఆ సమయంలో నేను ఇలా బాధపడేటప్పుడు నాలా ఎంతమంది… ఇలా ఉన్నారో అనుకుందట దీపిక. అందుకే మెంటల్ హెల్త్ గురించి అవగాహన తీసుకురావడానికి లివ్, లవ్, లాఫ్ ఫౌండేషన్ స్థాపించాను అని దీపిక చెప్పింది.