పవన్ కల్యాణ్‌కి డ్యాన్స్ చేయడం అంటే నచ్చదు.. ఈ మాట మేం అన్నది కాదు. ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకేనేమో ఒక్కోసారి పాటల్లో అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు. లేదంటే చిన్నగా మూమెంట్స్ వేస్తారు. అయితే గతంలో ఆయన హెవీ డ్యాన్స్‌లు, హుషారెత్తించే స్టెప్పులు చాలానే వేశారు. వాటికి ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు, గోలలు కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనలో అలాంటి ఉత్సాహం చూడలేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అది జరిగేలా ఉంది.
ఈ మాటను కూడా మేం చెప్పలేదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ అవార్డుల షోకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి, ఆ సినిమాలో పాటల గురించి, పవన్ కల్యాణ్ గురించి కొన్ని లీకులు ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన సినిమా టీమ్ నుండి వచ్చిన పోస్టర్ కూడా అదేనని టాక్.
మైకేల్ జాక్సన్‌ను గుర్తుకు తెచ్చేలా ఆ పోస్టర్లో పోజు ఇచ్చాడు పవన్. ఆ పాట ట్యూన్ డీఎస్పీ ఇచ్చాక.. చాన్నాళ్ల తర్వాత డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం తెప్పించావంటూ దేవిని పవన్ కల్యాణ్ అభినందించాడట. ఆ సినిమా టీజర్‌లో చెప్పినట్లు పవన్ ఈసారి పెర్ఫామెన్స్ బద్దలైపోతుంది. కొన్ని రోజుల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ ఒక పాట షూట్ చేసింది. అందులో పవన్ డ్యాన్స్ ఇరగదీశారు. పాట షూట్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చి.. ‘అదరగొట్టేశావయ్యా.. చాన్నాళ్ల తర్వాత డ్యాన్స్ చేయాలన్న కోరిక కలిగింది.
నాతో స్టెప్పులేయించావు’ అని అన్నారని డీఎస్పీ చెప్పారు. పవన్ నోట ఆ మాట వినగానే రెక్కలొచ్చినట్లు అనిపించిందని, గాల్లో తేలినట్టుందే పాట గుర్తొచ్చిందని చెప్పుకొచ్చారు డీఎస్పీ. మరి పవర్ స్టార్‌ని అంతలా ఉత్సాహపరిచిన ఆ పాటేంటి, ఆ బీటేంటి, ఆ స్టెప్పులేంటి అనేది చూడాలి.