టాలీవుడ్ లో ఏదైనా బయోపిక్ వస్తుందంటే చాలు.. దానికి సంబంధించి ఏదొక గొడవ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయనాయకుల బయోపిక్ లు వివాదానికి దారి తీస్తుంటాయి. ఇప్పుడు ‘దేవినేని’ సినిమా కూడా అదే కోవలోకి చేరింది. బెజవాడకి చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా దర్శకుడు నర్రా శివనాగేశ్వరావు ‘దేవినేని’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్.
కొన్నేళ్లక్రితం వంగవీటి మోహన్ రంగా, దేవినేని వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు కారణంగా ఎన్నో ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. మరోసారి పాతకక్షలను తెరమీదకు తీసుకొస్తున్నారేమో అనే సందేహాలు అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను తమ అనుమతి లేకుండా తెరకెక్కించడంపై దేవినేని నెహ్రూ తనయుడు, వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేనంటే సినిమాను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా..
ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడిపై పోలీసు కేసు ఫైల్ చేశారు. గతంలో వంగవీటి జీవిత కథ ఆధారంగా దర్శకుడు వర్మ రూపొందించిన ‘వంగవీటి’ సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో వర్మకి, వంగవీటి కొడుకు రాధాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తరువాత వివాదం సద్దుమణిగింది. మరి ఇప్పుడు ‘దేవినేని’ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి!