‘టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందా?’ అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఎఫ్.డి.సి (ఫిల్మ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా దిల్ రాజును ఎంపిక చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే వారు ఈ విషయంలో కీలక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్.డి.సి కార్యకలాపాలు ఇప్పుడు సజావుగా సాగడం లేదు.
‘తలసాని ఉన్నప్పుడు వీటి పనులు అన్నీ బాగానే జరిగేవి’ అనే విమర్శలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారట. దిల్ రాజు అయితే ఈ పదవికి పెర్ఫెక్ట్ అనేది ఆయన నమ్మకం. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు ముందుండి పరిష్కరిస్తున్న సందర్భాలు చాలానే చూశాం. ‘దాసరి తర్వాత దాసరి’ అనే పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు.
ఇక.. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి – దిల్ రాజు..ల మధ్య ఈ విషయమై చిన్నపాటి మీటింగ్ కూడా జరిగిందట.’ఎఫ్.డి.సి’కి ఛైర్మన్‌గా ఉండమని స్వయంగా రేవంత్ రెడ్డి… దిల్ రాజుని కోరడం జరిగిందట. కానీ దిల్ రాజు.. ‘ఈ బాధ్యత తీసుకుంటే పూర్తిగా న్యాయం చేయగలనా…? సినిమా నిర్మాణాలు, ఇంకో వైపు ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారాలు వంటివి చాలానే ఉన్నాయి కదా’ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారట.
కానీ ‘ఎఫ్.డి.సికి దిల్ రాజు బెస్ట్ ఛాయిస్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ పెద్దలందరి ఆలోచనగా తెలుస్తుంది. దిల్ రాజు వంటి వాళ్ళు ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంటుందనేది అందరి నమ్మకం. మరి దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!