ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర సినిమాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఐదు సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్ల దగ్గర ఫుల్ సందడి కనిపిస్తోంది. అయితే ఈ పండగ సీజన్‌లో నిర్మాతగా తన సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోయినా, అసలు సిసలు విన్నర్‌గా మాత్రం దిల్ రాజు నిలిచారు. ఆయన పంపిణీ చేసిన చిత్రాలన్నీ వసూళ్ల వర్షం కురిపిస్తూ ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు దిల్ రాజు జడ్జిమెంట్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Dil Raju
నైజాం ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేసిన సినిమాలన్నీ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా, యువ హీరోలు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు కూడా మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ మూడు సినిమాల పంపిణీ హక్కులను దిల్ రాజు దక్కించుకోవడం విశేషం. వీటి రిజల్ట్ చూస్తుంటే పక్కా ప్లానింగ్‌తో ఆయన మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారని అర్థమవుతోంది.
మరోవైపు, పండగ బరిలో నిలిచిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక స్ట్రగుల్ అవుతున్నాయి. యాదృచ్ఛికంగా ఈ రెండు సినిమాలను దిల్ రాజు పంపిణీ చేయలేదు. పంపిణీకి ముందే ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయడంలో దిల్ రాజు మళ్ళీ తన మార్క్ చూపించారని ఫిలిం నగర్ టాక్. దీనివల్ల ఈ సంక్రాంతి సీజన్ మొత్తం ఆయనకే కలిసి వచ్చినట్లు అయింది.
గత ఏడాది సంక్రాంతి పరిస్థితులు గమనిస్తే, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో రామ్ చరణ్ సినిమా కొంత నిరాశపరిచినప్పటికీ, వెంకటేష్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ అనుభవంతోనే ఈసారి కేవలం పంపిణీపైనే ఫోకస్ పెట్టి మంచి సక్సెస్ రేటును మెయింటైన్ చేస్తున్నారు.