బాపు బొమ్మ స్నేహ.. హద్దులు మీరని అందంతో.. పాత్రకు తగిన అభినయంతో ఇటు తెలుగు ప్రేక్షకులను.. అటు తమిళ ప్రేక్షుకుల మదిలో మంచి స్థానం సంపాదించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత నటనకు స్వస్తి చెప్పకుండా.. తనకు నప్పే క్యారెక్టర్స్ ఎంచుకుంటూ మెప్పిస్తోంది. తాజాగా ఆమె తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన “వేలైక్కారన్” లో నటించారు. శివ కార్తికేయన్, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లో మంచి కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం కోసం స్నేహ 18 రోజులు పనిచేశారు. తన పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అయితే సినిమా చూసుకున్న తర్వాత మాత్రం బాధ పడ్డారు. ఎందుకంటే తన పాత్ర నిడివి చెప్పిన దానికన్నా చాలా తక్కువగా ఉంది. ఈ విషయంపై ఆమె మీడియా ముందు
అసంతృప్తి వ్యక్తం చేశారు. “నేను ఈ సినిమాలో కనీసం 15 నిమిషాలు కనిపిస్తానని అనుకున్నా. కానీ పది నిముషాలు కూడా లేకుండా కట్ చేశారు. అనేక మంచి సన్నివేశాలు తొలిగించారు” అని డైరక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నేహ మాటలకు డైరక్టర్ మోహన్‌రాజా వెంటనే స్పందించారు. “స్నేహ అద్భుతంగా నటించారు. ఆమె ఉన్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. కానీ సినిమా నిడివి తగ్గించాల్సి అవసరం ఏర్పడడం వల్ల.. ఆమె పాత్ర నిడివి తగ్గించాం. స్నేహదే కాకుండా మిగిలిన నటీనటుల పాత్రల నిడివిని కూడా తగ్గించాం. ఇలా చేయాల్సి వచ్చినప్పుడు నాతో పాటు చిత్ర బృందం మొత్తం చాలా బాధ పడింది” అని అన్నారు. అలాగే అందరి ముందు స్నేహ కు క్షమాపణలు చెప్పారు.