కొంతమంది దర్శకులు తొలి సినిమాతోనే తామెంత డిఫరెంట్ అనేది చెప్పేస్తుంటారు. అయితే అది మాటల్లో కాదు… చేతల్లో ఉంటుంది. అంటే ఆ సినిమా కాన్సెప్ట్, తెరకెక్కించిన విధానం, సినిమా టైటిల్, అందులో నటీనటుల ప్రవర్తన… ఇలా చాలా అంశాల్లో తాము ఏ విధంగా ఇతరులకు భిన్నం అని చెబుతుంటారు. అలాంటివారిలో అజయ్ భూపతి ఒకరు. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమైన ఆయన… ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాతో వస్తున్నారు.
‘ఆర్‌ఎక్స్ 100’ డైరక్టర్, హీరోయిన్ కాంబినేషన్‌లోనే ‘మంగళవారం’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలోనూ, ఈ సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. అందులో ఇందుగా కనిపిస్తే, ఇందులో శైలజగా అలరించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు ‘మంగళవారం’ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ విషయంలో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటికి (Ajay Bhupathi) అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘మహాసముద్రం’ సినిమా మొదలు పెడుతున్నప్పుడే నా తర్వాతి సినిమాగా ‘మంగళవారం’ చేయాలనుకున్నా. అయితే ఈ టైటిల్ గురించి కొంతమంది దగ్గర ప్రస్తావించినప్పుడు ‘ఇదేం టైటిల్… ఎందుకు పెడుతున్నావ్’ అని అన్నారు. నిజానికి మంగళవారం అంటే కొందరు చెడ్డరోజుగా చూస్తారు కానీ.. అది శుభప్రదమైన రోజు. జయవారం అని అనేవారు. అసలు ముందు మనకు ఆ రోజే సెలవు ఉండేది. బ్రిటీషర్లు వచ్చి ఆదివారం సెలవు చేశారు అని చెప్పారు అజయ్ భూపతి.
‘మంగళవారం’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రముఖ దర్శకుడు వంశీ ఫోన్ చేశారట. ‘మంచి టైటిల్ పెట్టావ్ అజయ్. నేను ఆ పేరు పెడదామంటే అప్పట్లో నిర్మాతలు ఒప్పుకోలేదు’ అని అన్నారట. ఇక ఈ సినిమా చివరి 45 నిమిషాల్లో ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయట. పాయల్ పాత్ర చూసి అందరూ షాకవుతారట. అయ్యో అనుకొని ప్రేక్షకులు బాధపడేలా కూడా ఆ పాత్ర ఉంటుందట. సినిమా చూసినవాళ్లు తప్పకుండా కంటతడి పెడతారు అని చెప్పారు. ఈ విషయం తేలాలంటే ఈ శుక్రవారం రావాల్సిందే.