‘బొమ్మరిల్లు’ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసాడు దర్శకుడు భాస్కర్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘బొమ్మరిల్లు’ నే తన ఇంటి పేరుగా మార్చేసుకుని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ గా మారిపోయాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. అదెలా పుట్టింది అనే విషయాన్ని దర్శకుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. ” నేను దిల్ రాజు గారి దగ్గర ‘ఆర్య’ సినిమాకు పని చేస్తున్న టైములో ఆ మూవీ హిట్టయితే దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. అనుకున్నట్టు గానే ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది.వెంటనే నన్ను స్టోరీ రెడీ చేసుకోమన్నారు.
ముందుగా ఆయనకి రెండు కథలు చెప్పాను. అవి వద్దన్నారు. మంచి ఫ్యామిలీ మూవీ చేద్దాం అని చెప్పారు. దాంతో నేను ‘బొమ్మరిల్లు’ కథ చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది.అయితే ఆయనకి స్టోరీ నెరేట్ చేసినప్పుడు హీరోయిన్ పాత్ర పెద్దగా లేదు. దాని మీద వర్క్ చేయమని రాజు గారు చెప్పారు.అందుకు నేను 15 రోజులు టైం అడిగాను. నేను, వాసు వర్మ ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. అలా 14 రోజులు గడిచిపోయాయి. పాత్ర గురించి ఒక్క ముక్కా రాయలేదు. బాగా ఫ్రస్టేషన్ వచ్చేసింది. 15వ రోజు కూడా గడిచిపోయింది. ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు రాజు గారిని కలవాలి.అయితే తెల్లవారుజామున 4 గంటలకు వాసుతో డిస్కస్ చేస్తూ నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను.
గతంలో ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములొస్తాయి అని చెప్పి ఇంకోసారి ఢీకొట్టిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. 15 రోజులు ఏమీ రాయని మేము.. ఆ ఐడియా రాగానే కేవలం 2 గంటల్లో ఆ క్యారెక్టర్ డిజైన్ చేసాం. ఆ పాత్ర కంప్లీట్ చేశాకే పడుకున్నాం. సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది, ఎవరు కావాలో చెప్పండి అన్నారు. జెనీలియా కావాలి అనుకున్నాం. ఈ పాత్ర రాసినప్పుడే.. ఎవరు ఇందులో నటిస్తారో వాళ్లకు జాక్‌పాటే అనుకున్నాం. జెన్నీ మొదటి రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడింది.కానీ 3వ రోజు నుండీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసింది. ఆమె ఈ పాత్రను చాలా ఇంప్రొవైజ్ చేసింది. సెట్స్ పైకి వెళ్ళాక ఆ పాత్ర ఇంకా మెరుగైంది” అంటూ భాస్కర్ చెప్పుకొచ్చాడు.