సౌత్ సినిమాలు బాలీవుడ్‌కి వెళ్లి సరైన విజయాలు సాధించడం లేదు. అయితే, దీనికి అక్కడి నేటివిటీని ఆపాదించకుండా సినిమాలు తీసేయడమే కారణం అని.. అంటున్నారు. అయితే ఇప్పుడు ‘మిలి’ కూడా అలానే తీశారా? అవుననే అనిపిస్తోంది దర్శకుడు మతుకుట్టి జేవియర్ మాటలు వింటుంటే. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రధారిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘మిలీ’. మలయాళ ‘హెలెన్’ సినిమాను హిందీలో ఇలా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జేవియర్ మీడియాలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
‘హెలెన్’తో పోలిస్తే.. ‘మిలీ’ సినిమా భిన్నంగా ఉంటుంది అంటున్న మత్తుకుట్టి జేవియర్ స్క్రిప్ట్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని చెబుతున్నారు. మాతృతకతో పోలిస్తే… ‘మిలీ’లో పాత్రలపరంగా భిన్నంగా ఉంటుంది. ‘హెలెన్’ సినిమా స్క్రిప్ట్‌ని మార్చేసి హిందీలో తీద్దామని కొంతమంది నిర్మాతలు నన్ను అడిగారు.. కానీ ఆ మార్పులకు నేను ఒప్పుకోలేదు. చివరికి బోనీ కపూర్ స్క్రిప్ట్ మార్చకుండానే సినిమా చేద్దాం అన్నారు అప్పుడు ‘మిలీ’ స్టార్ట్ అయ్యిందని చెప్పారు జేవియర్.
నిజానికి ‘హెలెన్’ చాలా చిన్న బడ్జెట్ సినిమా. బాలీవుడ్‌కి వచ్చేసరికి పెద్ద సినిమా అయిపోయింది. బాలీవుడ్‌కి తగ్గట్టుగా పాత్రలకు తగ్గ నటీనటుల్ని ఎంచుకున్నాం. అయితే ఇదేం అంత ఈజీగా సాగేలేదు. దీనికితోడు భాష సమస్య ఒకటి. దీంతో చిత్రీకరణ సమయంలో ఇబ్బంది అనిపించింది. అయితే నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా జాన్వీ సాయపడింది. నేను అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయడానికి జాన్వీ చాలా హెల్ప్ చేసింది అని చెప్పారు జేవియర్.
‘మిలీ’ సినిమాలో జాన్వీ.. జానీ మిలీ నాడియల్ అనే నర్సుగా నటించింది. కెనడా వెళ్లి స్థిరపడాలని మిలీ కోరిక. అయితే అనుకోకుండా ఒక కోల్డ్ స్టోరేజీలో మిలీ ఇరుక్కుపోతుంది. ఆ తర్వాతేం జరిగింది, ఆ స్టోరేజీ నుండి మిలీ ఎలా బయటకు వచ్చింది అనేది కథ. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని జేవియర్ చెప్పారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. నవంబరు 4న సినిమాను విడుదల చేస్తున్నారు.