Surya Pratap: రీమేక్‌ల హీరోతో బాలీవుడ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్న సుకుమార్‌ శిష్యుడు!

తెలుగు దర్శకులు బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కొంతమంది ఇలా సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు పాన్‌ ఇండియా కాలంలో వరుస పెట్టి మన దర్శకులు అక్కడకు వెళ్తున్నారు. తాజాగా మరో యువ దర్శకుడు బాలీవుడ్‌ ఫ్లయిట్‌ ఎక్కబోతున్నారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రీమేక్‌లకు బాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన హీరోనే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అని చెబుతున్నారు. సుకుమార్‌ (Sukumar) శిష్యుల్లో చాలామంది దర్శకులు అయ్యారు.

ఆ మాటకొస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి విజయాలు అందుకున్న యువ దర్శకులు చాలామంది ఆయన గ్యారేజ్‌ నుండి వచ్చినవాళ్లే. అలా ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్‌ (Palnati Surya Pratap) . రాజ్‌తరుణ్‌ (Raj Tarun), హెబ్బా పటేల్‌ (Hebah Patel) నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయమే అందుకుంది. ఆ తర్వాత ‘18 పేజీస్‌’ అనే మరో సినిమా తీశారు. దీనికి కూడా మంచి స్పందనే వచ్చింది.

ఈ రెండు సినిమాలకు ఆయన గురువు, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఆయన బాగా సాయం చేశారు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. సూర్య ప్రతాప్‌ ఇప్పుడు అదే సుకుమార్‌ సాయంతో బాలీవుడ్‌కి వెళ్తున్నారని టాక్‌ నడుస్తోంది. క‌నెక్ట్ మీడియాతో కలసి సూర్య ప్ర‌తాప్ ఓ సినిమా చేయబోతున్నారట. ఈ క్రమంలో ఆయ‌న ముంబయిలో ఉన్నారట.

ఇప్పటికే టైగ‌ర్ ష్రాఫ్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు కూడా సమాచారం. తెలుగు సినిమాల రీమేక్‌లు అంటే ఆయనకు బాగా ఇష్టం. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శకుడితోనే సినిమా అంటే ఆయన వెంటనే ఓకే చెప్పేయొచ్చు అంటున్నారు. మంచి యాక్షన్‌ కథ అయితే చాలు అని అనుకుంటున్నారు. మరి సూర్య ప్రతాప్‌ ఎలాంటి కథ రాసుకున్నారో చూడాలి. చూద్దాం మరి సుకుమార్‌ శిష్యుడు బాలీవుడ్‌ వెళ్తారేమో.. వెళ్తే మాత్రం ఇది రికార్డు అని చెప్పాలి. ఇంకా సుక్కు శిష్యులు ఎంతమంది ఇలా వెళ్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus