కన్నడ చిత్ర పరిశ్రమలో కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించి దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించకున్న ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా చేసినప్పటికీ ఈయన మాత్రం తెలుగువారని తెలియడంతో తెలుగు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈయన మడకశిర నియోజకవర్గం లోని నీలకంఠాపురానికి చెందిన వ్యక్తి అలాగే మాజీ మంత్రి రఘువీరారెడ్డికి స్వయాన సోదరుడు కుమారుడు కావడం విశేషం.
ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తాజాగా తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో సందడి చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈయన నీలకంఠాపురంలో సందడి చేసినట్టు తెలుస్తుంది.ప్రశాంత్ తండ్రి సుభాష్ రెడ్డి ఈ మధ్యకాలంలో కాలం చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈయనను తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో ఖననం చేశారు.ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీ తన తండ్రి జయంతి కావడంతో ప్రశాంత నీల్ కుటుంబ సభ్యులు నీలకంఠాపురంలో సందడి చేశారు.
ఇక ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి మనకు స్వాతంత్రం వచ్చిన రోజే జన్మించారు. అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాగా, ఈయన తండ్రి జన్మించి కూడా 75 సంవత్సరాలు కావడంతో ప్రశాంత్ నీల్ తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఈయన నీలకంఠాపురంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఏకంగా 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని రఘువీరారెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక కంటి ఆసుపత్రి కోసం ఈయన ఏకంగా 50 లక్షలు విరాళం ప్రకటించడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బిజీ కానున్నారు.