‘నేను బతికే ఉన్నా.. సినిమాలు తీస్తే?’ ఈ మాట వినడానికి మామూలుగానే ఉన్నా.. ఈ మాట అనే వాళ్లకు, అనేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. తాజాగా ఇలాంటి మాట అని వైరల్ అయ్యారు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్. సోషల్ మీడియాలో నెటిజన్లు పేరుతో కొంతమంది చేసే వికృత చేష్టలకు, చిరాకెత్తించే మాటలకు ఆయన కూడా బాధితుడు అయ్యారు. అయితే వాటిని చూసి ఆయన కొందరిలా కుంగిపోకుండా చాలా బలంగా రిప్లై ఇచ్చారు.
సెల్వ రాఘవన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండున్నర దశాబ్దాల నుండి ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఓ వైపు విలక్షణ దర్శకుడిగా, మరోవైపు నటుడిగా ఆయన మెప్పిస్తూ వస్తున్నారు. తెలుగులో వెంకటేశ్‌తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అనే సినిమా చేశారాయన. ఇటీవల విజయ్ ‘బీస్ట్’ సినిమాలో కూడా కనిపించారు. త్వరలో తన బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తారని వార్తలొస్తున్నాయి.
అలాంటి సెల్వ రాఘవన్ ఇటీవల ఓ అభిమానికి రిప్లై ఇస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. సెల్వరాఘవన్ 2002లో ‘తుళ్లువదో ఇలామై’ అనే సినిమా తీశారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి అవార్డులు కూడా తెచ్చింది. ఆ సినిమాలోని ఫొటోను షేర్ చేసిన ఓ అభిమాని ‘‘ఈ సినిమా దర్శకుడు చనిపోయినట్లున్నారు. లేదంటే సినిమాలు తీయడం మానేసైనా ఉండాలి’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కింద అతనిని కౌంటర్ ఇస్తూ చాలామంది కామెంట్స్ చేశారు.
అయితే (Selva Raghavan) సెల్వరాఘవన్ కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘‘మిత్రమా… అలా ఎందుకన్నావ్? నేను చనిపోలేదు. అలా అని సినిమాలు తీయడమూ మానేయలేదు. కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్నానంతే. నా కోసం నేను కొంత సమయాన్ని గడుపుతున్నా. నేను ఇంకా నలభైల్లోనే ఉన్నాను. త్వరలోనే మంచి సినిమాలతో మీ ముందుకొస్తాను’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. సెల్వరాఘవన్ తాజాగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చిన్ని’లో నటించారు. ‘7/G బృందావన కాలనీ’ సినిమా సీక్వెల్‌తో త్వరలో వస్తారనే వార్తలు కూడా వచ్చాయి.