గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అని చెప్పారు.. ఇంకొంతమంది ల్యాగ్ ఉంది అంటూ కంప్లైంట్స్ చేశారు తప్ప.. సినిమాకి ప్లాప్, డిజాస్టర్ వంటి టాక్ అయితే రాలేదు. కలెక్షన్స్ కూడా తీసి పారేసే విధంగా ఏమీ లేవు. బాగానే వస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సెలవులు ‘గేమ్ ఛేంజర్’ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని తీసుకొచ్చేలా చేస్తున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. సినిమా కోలుకుంటుందిలే అని అంతా అనుకుంటున్న టైం దర్శకుడు శంకర్ మెగా అభిమానులకు షాకిచ్చాడు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో తాను సంతృప్తి చెందలేదు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
శంకర్ మాట్లాడుతూ.. “వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ ఔట్పుట్ తో నేను సంతృప్తిగా లేను. ఎందుకంటే నేను ఇంకా చాలా మంచి సీన్స్ తీశాను. దీంతో 5 గంటల భారీ రన్ టైం వచ్చింది. దాన్ని థియేటర్ వెర్షన్ కోసం ట్రిమ్ చేయడంతో .. చాలా మంచి సీన్స్ పోయాయి. నాలాంటి ఫిలిం మేకర్ అస్సలు కాంప్రమైజ్ కాడు. ఈ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ నన్ను డిజప్పాయింట్ చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు.
శంకర్ కామెంట్స్ పై కొంతమంది మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘3 ఏళ్ళ పాటు తమ హీరో ఈ సినిమాకి పూర్తిగా తన టైం కేటాయించాడు, నిర్మాత దిల్ రాజు రూ.450 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టాడు. అందరి విలువైన సమయాన్ని తీసుకుని కూడా సరైన ఔట్పుట్ ఇవ్వకపోవడం ఏంటి?’ అంటూ వాళ్ళు విరుచుకుపడుతున్నారు.