Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
- January 29, 2026 / 05:54 PM ISTByFilmy Focus Writer
శంకర్ రీసెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ అయిన ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చడంతో బ్రాండ్ ఇమేజ్‌పై ప్రభావం పడింది. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వేల్పారి’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని చూస్తున్నా, బడ్జెట్ అడ్డంకులు ఆయన్ని వెంటాడుతున్నాయి. తమిళ వీరుడు వేల్పారి కథను సినిమాగా మలచాలంటే వందల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం.
Shankar
వరుస ప్లాపుల తర్వాత శంకర్ విజన్‌ను నమ్మి అంత మొత్తం వెచ్చించే సాహసం చేయడానికి టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు వెనకాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని అందరూ భావించారు. అయితే తాజాగా శంకర్‌కు బాలీవుడ్ నుంచి ఒక గట్టి భరోసా లభించినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ భారీ పీరియాడిక్ డ్రామాను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఈ డీల్ ఓకే అయినట్లే అనిపిస్తున్నా, లోపల కొన్ని కఠినమైన షరతులు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ సినిమాలంటే షూటింగ్ రోజులు పెరగడం, బడ్జెట్ అనుకున్న దానికంటే రెట్టింపు అవ్వడం కామన్ అనే పేరుంది. ఈ నెగిటివ్ పాయింట్‌ను దృష్టిలో పెట్టుకుని, పెన్ స్టూడియోస్ యాజమాన్యం శంకర్‌కు కొన్ని లిమిట్స్ పెట్టిందట. బడ్జెట్ కంట్రోల్ విషయంలో పూర్తి అధికారం తమకే ఉండాలని, అలాగే డెడ్ లైన్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టినట్లు టాక్.
నిజానికి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్‌కు ఇలాంటి కండిషన్లు కొత్తే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే రాజీ పడక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే బడ్జెట్ ప్లానింగ్ విషయంలో ముందే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారట. ఒకవేళ ఈ షరతులకు శంకర్ పూర్తిగా అంగీకరిస్తే, వేల్పారి ప్రాజెక్ట్ అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మల్టీస్టారర్ మూవీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ద్వారా శంకర్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని చూస్తున్నారు. సినిమా మేకింగ్ స్టైల్‌లో శంకర్ తన పంతం నెగ్గించుకుంటారా లేక నిర్మాత చెప్పినట్లు బడ్జెట్ పరిధిలోనే ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.















