తెలుగు సినిమాల్లో ట్రైన్ సీన్స్ అంటే.. అందులోనూ రైలులో జరిగే కామెడీ సీన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘వెంకీ’ (Venky) . మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) – శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్రైన్‌లోని కామెడీ ట్రాక్‌కి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అందుకే రైలు + కామెడీ సీన్స్ అనే కాంబినేషన్ గురించి మాట్లాడినప్పుడల్లా ఆ సీన్‌ను గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆ సీన్‌ని మించే సీన్ ఒకటి రాశాను అంటున్నారు శ్రీను వైట్ల.
గోపీచంద్‌తో (Gopichand) కలసి శ్రీను వైట్ల (Sreenu Vaitla) తెరకెక్కించిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలోని రైలు సన్నివేశం గురించి ప్రస్తావించారు. మరి ఆ సీన్ ‘వెంకీ’ సినిమాలోని సీన్‌లా ఉంటుందా అంటే.. అంతకుమించి ఉంటుంది అని అంటున్నారాయన. గోపీచంద్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుండో చెబుతున్న శ్రీను వైట్ల చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశారు.
తన మార్క్ వినోదాన్ని అందిస్తూనే.. గోపీచంద్ మార్క్ యాక్షన్‌ను అందించడం కోసం దాదాపు ఎనిమిది నెలల టైమ్ తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశా అని చెప్పారాయన. అలాగే ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ తరహా ట్రాక్ ఇందులోనూ ఉందని చెప్పారు. అలాగని ఏదో సెంటిమెంట్‌గా ఆ ట్రాక్‌ను బలవంతంగా ఇరికించలేదని అన్నారు.
సినిమా కథలో భాగంగానే ట్రావెల్ ఎపిసోడ్ వస్తుందని, ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ‘వెంకీ’ సినిమాతో పోల్చి చూస్తారని అర్థమైందని, అయితే రెండు ట్రాక్‌లకు సంబంధం ఉండదని చెప్పారు. ‘వెంకీ’ సీన్ కన్నా ‘విశ్వం’ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. మరి శ్రీను వైట్ల చెప్పింది నిజమేనా.. అంత కొత్తగా ఏం చేశారు, ఏం చూపించారు అనేది దసరాకి కానీ తేలదు. మంచి ఫలితం వచ్చి మంచి కామెడీ డైరెక్టర్ తిరిగి ట్రాక్‌లోకి రావడం మంచిదేగా.