ఒకప్పుడు సినిమా వస్తోంది అన్నా.. సినిమా వచ్చింది అన్నా.. సినిమా ఎలా ఉంది? ఎవరు బాగా నటించారు? ఏ అంశాలు బాగున్నాయి అని లెక్కలేసేవారు. అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి. వసూళ్ల విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో లెక్కలేసి లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ విషయాలు తన వరకు వెళ్లి అన్నాడో? లేక మరేమైనా కారణం ఉందేమో కానీ.. తారక్ (Jr NTR) కూడా ‘లెక్కల’ గురించి మాట్లాడాడు. ‘దేవర’ (Devara) సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమా టీమ్ అంతర్గతంగా సక్సెస్ మీట్ నిర్వహించుకుంది.
ఆ తర్వాత కొన్ని రికార్డెడ్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఇలా కార్యక్రమం ఏదైనా కావొచ్చు.. తారక్ మాత్రం కాస్త కొత్తగా మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడని అంశాలు, చెప్పని విషయాలు, డిస్కస్ చేయని పాయింట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అందులో కొన్ని సినిమా పరిశ్రమకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి. మరికొన్ని అభిమానులకు చెప్పాల్సిన విషయాలు అనిపిపస్తున్నాయి. అలాంటివాటిలో ఈ ‘లెక్కల’ కాన్సెప్ట్ ఒకటి. ‘దేవర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగకపోవడం వెలితిగా అనిపిస్తోందని చెప్పిన తారక్..
‘దేవర’పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను అని అన్నారు. అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని కూడా చెప్పాడు. అలాగే మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే నా బాధ్యత అని మరోసారి పునరుద్ఘాటించాడు తారక్. ఇక ఆయుధపూజ పాటలో తాతగారిని ఇమిటేట్ చేయాలని అందులో ఆ స్టెప్ పెట్టలేదని, అసలు ఆలోచనలో మా మైండ్‌లో లేదని తారక్ చెప్పాడు. పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే ఆ విషయం తెలిసింది అని చెప్పాడు.
అలాగే ఇటీవల సినిమాను లెక్కలు పెట్టుకుని చూస్తున్నారని, ఒకదానితో మరో సినిమాకు పోలికలు పెడుతున్నారని తారక్ అన్నాడు. అలాగే సినిమా చూసి సులభంగా ‘బాగోలేదు’ అనడం సర్వసాధారణమైపోయిందని, అలాగే సినిమాల విషయంలో నెగెవిటీ పెరిగిపోయిందని కామెంట్ చేశాడు తారక్. సినిమాల విషయంలో తూకంలో పెట్టి మరీ చూస్తున్నారని ఇది సరికాదని సూచించాడు. తారక్ ఎవరి గురించి ఈ మాటలు అన్నాడో అర్థం కావడం లేదు.