ఇప్పుడు యూత్ స్టార్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు నితిన్. అసలు ఈయన్ని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు తేజ. ‘జయం’ చిత్రం వీరిద్దరికీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ‘చిత్రం మూవీస్’ బ్యానర్ పై తేజనే నిర్మించాడు. ఈ చిత్రం 2002 లో వచ్చింది. ఆ తరువాత 3 ఏళ్ళకి వీరిద్దరి కాంబినేషన్లో ‘ధైర్యం’ అనే చిత్రం వచ్చింది. 2005 లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ప్లాపయ్యింది. ఇక అటుతర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ‘నితిన్ నాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు’ అంటూ ఓ సందర్భంలో తేజ.. నితిన్ పై కౌంటర్ వేసాడు. దీంతో వీరిద్దరికీ చెడిందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. ఇది నిజమే అని అందరూ ఫిక్సయిపోయారు.
అయితే తాజాగా ఈ విషయం పై తేజ క్లారిటీ ఇచ్చాడు. తేజ మాట్లాడుతూ.. “నాకు, నితిన్ కు మధ్య గ్యాప్ పెరగడానికి … కారణం నితిన్ కాదు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి. ‘ధైర్యం’ చిత్రం సమయంలో నాకు తెలిసిన ఓ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనడానికి ముందుకు వచ్చాడు. ‘ధైర్యం’ సినిమాని సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఆ సినిమా బాగా ఆడుతుందని నమ్మకం లేదు. తెలిసిన వాడు కావడంతో ‘ఇంట్లో భార్య పిల్లలు బావున్నారా.. అయితే నీ ఇష్టం అని ఆ డిస్ట్రిబ్యూటర్ తో అన్నా…! నా మాటల్లో మర్మం అర్థం చేసుకున్న ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా వెళ్ళిపోయాడు. ఈ చిత్రాన్ని కొనవద్దని నేనే చెప్పినట్లు ఆ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత సుధాకర్ రెడ్డికి చెప్పాడు. దీంతో సుధాకర్ రెడ్డి నన్ను నిలదీశారు. నేను సినిమా కొనొద్దని చెప్పలేదు.. భార్య పిల్లలు జాగ్రత్త అని మాత్రమే చెప్పా. ‘దానర్థం అదేకదా’ అని సుధాకర్ రెడ్డి కోపగించుకున్నారు. ఆ చిత్రానికి 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా. నష్టపరిహారంగా కోటి రూపాయలు నిర్మాతకు వెనక్కు ఇచ్చేసాను. అందుకే నితిన్ కు నాకు చెడింది” అంటూ చెప్పుకొచ్చాడు.