‘నేను శైలజ’ అంటూ శైలజతో తన ప్రేమ గురించి హరి తన ప్రేమ కథ గురించి కొన్నాళ్ల క్రితం చెప్పాడు. ఆ రోజుల్లో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో హరి – శైలజ ప్రేమ బయటకు కనిపించినా… అంతర్లీనంగా తండ్రీ కూతుళ్ల ప్రేమ, అనుబంధం రన్ అవుతూ ఉంటుంది. సినిమా క్లైమాక్స్ ఆ విషయమే చూపిస్తారు, కన్నీళ్లు తెప్పిస్తారు. అంతటి ఆలోచన, కథ… దర్శకుడు కిషోర్ తిరుమలకు ఎలా వచ్చింది అనుకునే వాళ్లున్నారు.
అందులో మీరు కూడా ఉండొచ్చు. దాని గురించి ఇటీవల కిషోర్ తిరుమల చెప్పుకొచ్చారు. కిషోర్ తిరుమల తనకు పాప పుట్టిన నాలుగు నెలలకే ఇండస్ట్రీకి వచ్చేశారట. ఇక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఆరు నెలలకు ఒకసారి ఇంటికెళ్లి వస్తుండేవారట. రోజూ ఇంటికొచ్చే తండ్రితో పిల్లలు ఎలా ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఇంటికొచ్చే తండ్రితో పిల్లలు ఎలా ఉంటారు? అనేది ఆ సందర్భంలో ఆయనకు అర్థమైందట. నిజానికి ఆ భావన అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఆయన నెలల తర్వాత ఇంటికెళ్లినప్పుడు తన కూతురికి, తనకు మధ్య తెలియని దూరం ఉన్నట్లు అర్థమైందట. అయితే ఇద్దరికీ ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఉందేట. కానీ.. తెలియని దూరం మాత్రం అనిపించేదట. ఈ అనుభవమే ‘నేను శైలజ’ సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చిందట. తన అనుభవాలు, చూసిన అంశాలతోనే ఆ సినిమా కథ రాశారట. దానికి అందమైన ప్రేమకథను జోడించి ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించారు కిషోర్ తిరుమల. ఇప్పుడు ‘ఆడాళ్లు మీకు జోహర్లు’ విషయంలోనూ అంతేనట.
ఆడవాళ్లు లేకుండా జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి సందర్భంలోనూ వాళ్లకు జోహార్లు చెప్పాల్సిందే. అంతటి ప్రభావం చూపిస్తారు మన జీవితాల్లో. ఈ పాయింట్‌నే తెరపై ఎందుకు చూపించకూడదు అనిపించిందట. ఈ సినిమాలో మన ఇంట్లోని ఆడవాళ్ల జీవితాలే కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి అంటున్నారు కిషోర్ తిరుమల. పది మంది ఆడవాళ్లు ఉన్న ఇంట్లో ఒక్కడే మగ పిల్లాడు ఉంటే.. వాడిపై అందరికీ ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా చూపిస్తున్నాం అని చెప్పారు కిషోర్ తిరుమల.