వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకుడిగా తన కెరీర్‌ను ‘తొలిప్రేమ’తో (Tholi Prema) విజయవంతంగా ప్రారంభించాడు. ఆ తర్వాత అఖిల్‌తో (Akhil Akkineni) ‘మిస్టర్ మజ్ను,’ (Mr. Majnu) నితిన్‌తో (Nithin Kumar) ‘రంగ్ దే’ (Rang De) సినిమాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలుచుకోలేకపోయాయి. మొదటి మూడు చిత్రాల్లో ప్రేమ కథలే చూపించిన వెంకీపై రొటీన్ కథల దర్శకుడని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితే అతడిని కొత్త తరహా కథలపై దృష్టి పెట్టేలా చేసింది. ‘సార్’తో (Sir) కోలీవుడ్‌కి అడుగుపెట్టిన వెంకీ అట్లూరి అక్కడి ప్రేక్షకులను తన ప్రతిభతో మెప్పించాడు.

ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించి, 100 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను విమర్శిస్తూ రూపొందించిన ఈ చిత్రం వెంకీకి కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’లో (Lucky Baskhar) దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) బ్యాంకింగ్ మోసాలపై ఆసక్తికర కథని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాడు. ఇది కూడా విజయవంతం కావడంతో వెంకీ హిట్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

ఇప్పుడేమో, వెంకీ మళ్ళీ తమిళ స్టార్ హీరోతో కలిసి మరోసారి కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం, సూర్యతో వెంకీ అట్లూరి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతోంది. ఈ కాంబినేషన్ పక్కాగా ఖరారైనట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వెంకీ ఈ సారి కూడా సూటిగా ప్రస్తుత సమాజానికి సంబంధించిన పాయింట్‌తో, విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. అధికారులు, ప్రభుత్వాల పనితీరు వంటి అంశాలను టచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

జనాలకు మంచి సందేశం ఇచ్చేలా ఆ కథను డెవలప్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటి వరకూ సూర్య (Suriya) కెరీర్‌లో ‘కంగువా’ (Kanguva) పెద్ద విఫలంగా నిలవడంతో, ఈ సినిమా అతనికి మంచి కమ్‌బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఆర్జే బాలాజీతో మరో సినిమా ప్లాన్ చేశారు. వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ అయితే, ఇది 2025లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
