ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండో చిత్రంతోనే హీరో ఆనంద్ దేవరకొండకు మంచి హిట్ దక్కింది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం.. ప్రతీ ఒక్కరి నటన.. నిజ జీవితాలకు దగ్గరగా ఉండడంతో.. ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వినోద్ అనంతోజు చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ… ” ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కథను నేను అలాగే మరో రైటర్ జనార్థన పసుమర్తి కలిసి రెడీ చేసాం.మేమిద్దరం గుంటూరుకు చెందిన వాళ్లమే. మావి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మా ఇద్దరి జీవితాల్లోనూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి.వాటిని ఆధారం చేసుకునే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ స్క్రిప్ట్ ను తయారు చేశాం. ఈ సినిమాలో చూపించింది మొత్తం.. మేము నిజజీవితంలో చూసిన సంఘటనలే.! ఇక ఈ చిత్రంలో హీరోగా మొదట ఆనంద్ దేవరకొండ ను హీరోగా అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిన తరువాత చాలా మంది నిర్మాతలని అలాగే హీరోలను కలిశాము.
అయితే వారిలో చాలా మంది కొన్ని మార్పులను కూడా సూచించారు. మాకు స్క్రిప్ట్ లో మార్పులు చెయ్యడం ఇష్టం లేదు. డబ్బు కోసమనే సినిమా చెయ్యాలి అనుకోలేదు. మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్నాము. అందుకే మార్పులు చెయ్యడానికి ఇష్టపడలేదు. ఒకరోజు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను కలిసి ఈ స్క్రిప్ట్ ను వివరిస్తే.. ఈ కథకు ఆనంద్ దేవరకొండ సరిపోతాడు అని సూచించాడు. దాంతో ఆనంద్ ‘దొరసాని’ షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్లి కథ వినిపించాను. అతనికి కూడా నచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ ఫైనల్ అయ్యాడు. ఒకవేళ అతను కనుక ఒప్పుకోకపోతే కొత్త హీరోతోనే చెయ్యాలి అని ముందే అనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు వినోద్.