స్టార్ హీరోల పుట్టిన రోజులకు ముందు అభిమానుల నుండి ఎలాంటి హడావుడి, సందడి నెలకొంటుందో అలాంటి హుషారు కనిపించింది ఏడాది క్రితం ఓ యువ హీరోకి (ఇంకా డెబ్యూ చేయలేదు). సోషల్ మీడియా, ఆఫ్‌లైన్‌లో ఆ కుర్రాడి ఫొటోలు, పోస్టర్లతో మామూలుగా హడావుడి కనిపించలేదు. అనుకున్న రోజు (సెప్టెంబరు 6) రానే వచ్చింది. అప్పటికే వచ్చిన టీజర్ పోస్టర్‌లు, అఫీషియల్ లీక్‌లు, అన్ అఫీషియల్ లీకులకు తగ్గట్టే ఆ హీరో తొలి సినిమా అనౌన్స్ అయింది. అయితే ఇప్పటివరకు ఆ సినిమా మొదలుకాలేదు.
Mokshagna
ఆ హీరో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ. ఆ సినిమా ప్రశాంత్ వర్మ తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్. ఇదిగో ఓపెనింగ్, అదిగో ముహూర్తం అంటూ కొన్ని నెలలు అటు ఇటు తిప్పి ఫైనల్‌గా చుట్టేశారు అని సమాచారం. మోక్షజ్ఞ పుట్టన రోజు సందర్భంగా మరోసారి ఆ ప్రాజెక్ట్ ప్రస్తావన బయటకు వచ్చింది. సినిమా అనౌన్స్‌మెంట్‌కి ఏడాది అంటూ దాని గురించి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఆ సినిమా ఉందో లేదో ఇంకా టీమ్ నుండి అధికారిక సమాచారం రాకపోవడం. మరొకటి కొత్త కథలు వింటున్నాడు మోక్షు అనే మాటలు బయటకు రావడం.
మొన్నీ మధ్య నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రేమ కథ కోసం మోక్షజ్ఞ చూస్తున్నాడు అని చెప్పారు. అంటే ప్రశాంత్ వర్మ సినిమా ప్రేమ కథ కాదు అని చెప్పకనే చెప్పారు. అలాగే ఆ సినిమా లేదని కూడా చెప్పారు. ఇక క్రిష్ తెరకెక్కిస్తారు అంటూ వార్తలొస్తున్న ‘ఆదిత్య369’ సినిమా సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ద్వారా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ బాలయ్యే ఇవ్వాలి అని క్రిష్ ఇటీవల చెప్పుకొచ్చారు.
ఇలా ఎలా చూసినా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది తేలడం లేదు. పోనీలే ఈ పుట్టిన రోజు నాడు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. ప్రస్తుతం మోక్షుకి 32 ఏళ్లు. ఇంకా అరంగేట్రం అవ్వలేదు. ఇంకాస్త ఆలస్యమైతే.. కొన్ని రకాల కథలకు పరిమితం అయిపోవాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.