డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

“నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి డిజాస్టర్ చిత్రాలతో రవితేజ కథానాయకుడిగా క్రేజ్ పరంగా మార్కెట్ పరంగా కాస్త వెనుకబడ్డారు. అయితే.. టీజర్, వీడియో సాంగ్ తోనే రవితేజ ఈ బ్యాక్ అనిపించిన సినిమా “డిస్కో రాజా”. రెట్రో గ్యాంగ్ స్టర్ గా రవితేజ చేసిన హల్ చల్ మామూలుగా లేదు మరి. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జనవరి 24) విడుదలవుతుండగా.. సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకొని.. రవితేజ హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: వాసు (రవితేజ)పై లడక్ లో కొందరు ఎటాక్ చేస్తారు. ఆ ఎటాక్ లో బ్రైన్ డెడ్ అయిన వాసును ఆ మంచు కొండల్లోనే వదిలేసి వెళ్లిపోతారు. చనిపోయిన మనుషులకు మళ్ళీ ప్రాణం పోసే ప్రయోగం చేస్తున్న పరిణీతి (తాన్య హోప్) & టీం.. వాసు బాడీ మీద ప్రయోగం మొదలుపెడుతుంది. ప్రయోగాల కారణంగా ప్రాణం తిరిగొచ్చిన వాసు తన గతాన్ని మర్చిపోయి.. ఆ గతాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో చెన్నై వెళ్తాడు. గతం కోసం వెతుక్కుంతున్న వాసుని కొందరు 1980లో చనిపోయినడిస్కో రాజా అనుకోని ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

అసలు డిస్కో రాజా ఎవరు? వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి? వీళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? అనేది “డిస్కో రాజా” కథాంశం.

నటీనటుల పనితీరు: రవితేజలోని ఎనర్జీని ఈమధ్యకాలంలో పూర్తిస్థాయిలో వాడుకున్న సినిమా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో రవితేజ ఇరగదీశాడు. ముఖ్యంగా “డిస్కో రాజ్” పాత్రలో రవితేజ ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఆ క్యారెక్టర్ లో రవితేజ మ్యానరిజమ్స్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, లుక్ & సెటప్ మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాక ఆడియన్స్ కు మంచి హై ఇస్తుంది. అయితే.. రవితేజ ఎనర్జీని వాడుకున్నంతగా.. రవితేజలోని కామెడీ టైమింగ్ ను యూటిలైజ్ చేసుకోలేదు దర్శకుడు. దాంతో రవితేజ నుండి కామెడీ ఎక్కువగా ఆశించే ఫ్యాన్స్ మాత్రం కాస్త బోర్ ఫీలవుతారు.

నభా నటేష్, తాన్య హోప్, పాయల్ రాజ్ పుత్ లకు కథలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ.. స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం బాగుంది. ముగ్గురూ తమ గ్లామర్ తో పాత్రలకి న్యాయం చేశారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా ఈ సినిమాలో సేతు అనే పాత్రలో అదరగొట్టాడు. రవితేజ-బాబీ సింహా కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. ఫ్యాన్స్ ను అలరిస్తాయి.

సునీల్ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర “డిస్కో రాజా” చిత్రంలో పోషించాడు. ఈ క్యారెక్టర్ గురించి ఇంక ఏం చెప్పినా సినిమాలోని మైన్ ట్విస్ట్ రివీల అయిపోతుంది కాబట్టి.. సినిమాలో చూసి థ్రిల్ అవ్వండి అని మాత్రమే చెప్పగలను. రాంకీ, సత్య, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ & సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని “డిస్కో రాజా” చిత్రానికి మెయిన్ పిల్లర్స్. సంగీతం నేపధ్యం ఉన్న సినిమాకి రెట్రో మ్యూజిక్ తో తమన్ జీవం పోస్తే.. సైంటిఫిక్ యాంగిల్ తోపాటు 1980 కాలాన్ని తెరపై అద్భుతంగా ప్రెజంట్ చేసి కార్తీక్ ప్రశంసార్హుడయ్యాడు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి. సునీల్, సత్య గెటప్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి తప్పితే.. మిగతా సెటప్ మొత్తం అదిరిపోతుంది. ఆ విగ్గుల విషయంలో కూడా కాస్త కేర్ తీసుకొని ఉంటే ప్రేక్షకుడు సినిమాలో మరింత ఇన్వాల్వ్ అయ్యేవాడు.

నిర్మాత రామ్ ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. రూపాయికి రెండు రూపాయలు ఖర్చు చేశాడు.. తప్పితే ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

దర్శకుడు వి.ఐ.ఆనంద్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక అసాధారణమైన పాయింట్ ను తీసుకొని దాన్ని సాధారణమైన కథనంతో నడిపి.. మధ్యలో ఎంటర్ టైన్మెంట్ & కొన్ని ఊహించని ట్విస్టులు జోడించి ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాడు. “డిస్కో రాజా”కు కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. కానీ.. కథనం విషయంలో మాత్రం సరైన్ కేర్ తీసుకోలేదు. కథ అల్లుకున్న పాయింట్ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంది. కానీ.. కథనం మాత్రం మరీ రొటీన్ గా ఉంది. అందువల్ల.. ఫస్టాఫ్ లో ఉన్న ఎగ్జైట్మెంట్.. సెకండాఫ్ లో కనిపించదు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ మినహా సెకండాఫ్ మొత్తం రొటీన్ గా సాగడం కూడా సినిమాకి మైనస్. నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకోవడం, రవితేజను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపించడం, సాధారణమైన రివెంజ్ స్టోరీకి సైన్స్ ను యాడ్ చేయడం వంటి విషయాల్లో సక్సెస్ అయిన ఆనంద్.. ఆడియన్స్ కు బోర్ కొట్టించకుండా కథనాన్ని రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. దాంతో సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

విశ్లేషణ: రవితేజను ఫ్యాన్స్ ఎలా చూడాలి అని వెయిట్ చేస్తున్నారో అలా ప్రెజంట్ చేసిన సినిమా “డిస్కో రాజా”. రొటీన్ రివెంజ్ డ్రామా అనే కాన్సెప్ట్ ను పక్కన పడేస్తే.. రవితేజ హల్ చల్ & కథలోని ట్విస్టులు, తమన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ వర్క్ కోసం “డిస్కో రాజా” సినిమాని హ్యాపీగా ఒకసారి చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here to Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus