‘మట్కా’ (Matka) సినిమా ప్రచారంలో భాగంగా సినిమా దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) ఇటీవల మాట్లాడుతూ ఓ పేరు ప్రస్తావనకు తెచ్చారు. సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు స్ఫూర్తి ఆయనే అంటూ చెప్పుకొచ్చారు కూడా. ఆ వ్యక్తే రతన్ ఖత్రీ. ఆయనే ఒరిజినల్ మట్కా కింగ్ అని చెబుతారు. సినిమా ఈనెల 14న వస్తున్న నేపథ్యంలో ఎవరీ రతన్ ఖత్రీ అంటూ ఓ చర్చ మొదలైంది. ఆయనకు, మన దేశానికి ఏంటి సంబంధం అని కూడా వెతికేస్తున్నారు.
రతన్ ఖత్రీ అనడం కంటే మట్కా కింగ్ రతన్ ఖత్రీ అంటేనే ఎక్కువమందికి తెలుస్తుంది. గ్యాంబ్లింగ్ ప్రపచంలో రతన్ ఖత్రీకి సెపరేట్ చరిత్ర ఉంది. పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన రతన్ దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చాడు. 1962లో ముంబయి కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత దేశం మొత్తం అతిపెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. నిజానికి ఖత్రీ తొలినాళ్లలో మరో మట్కా కింగ్ కళ్యాణ్‌జీ భగత్‌తో కలిసి పనిచేశాడు.
కొన్నాళ్లు కలసి దందా చేసిన తర్వాత రతన్ మట్కా అనే తన సొంత కార్యక్రమం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం పాటు గ్యాంబ్లింగ్ రారాజుగా వెలిగాడు. దేశంలోని చీకటి కాలం ఎమర్జెన్సీలో జైలుకు కూడా వెళ్లాడు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో దేశం మొత్తం బెట్టింగ్ నడపడం అంటే ఎంతటి నెట్‌వర్క్ బిల్డ్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రతన్ ఖత్రీ స్ఫూర్తితోనే ‘మట్కా’ సినిమాలో వాసు క్యారెక్టర్ డిజైన్ చేశారు కరుణ కుమార్.
1960 కాలం నాటి విశాఖపట్నం బ్యాక్ డ్రాప్‌లో ‘మట్కా’ సినిమా సాగుతుంది. ఇలాంటి రా అండ్ రస్టిక్ విషయాలను సినిమాలుగా తీసి విజయం సాధించడం కరుణ కుమార్‌కు అలవాటు. కాబట్టి ఈ సినిమా కూడా అలానే చేసుంటారు అని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు ఇదే కథతో ఓ వెబ్‌సిరీస్ కూడా సిద్ధమవుతోంది. తమన్నా (Tamannaah) ప్రియుడు విజయ్ వర్మ (Vijay Varma) ప్రధాన పాత్రలో ఆ సిరీస్ సిద్ధం చేస్తున్నారు.