వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాల ద్వారా నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఒక నిర్మాత మాత్రం వర్మ స్పీచ్ వల్ల ఏకంగా కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోయానని చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా వర్మ చేసిన చిన్న తప్పు ఆ నిర్మాత పాలిట శాపమైంది. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన రామ సత్యనారాయణ నిర్మాతగా 200కు పైగా సినిమాలను నిర్మించారు. 2014 సంవత్సరంలో ఈ నిర్మాత రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్ సినిమాను నిర్మించగా వర్మ నటులు,
సాంకేతిక నిపుణుల పారితోషికాలు కాకుండా కేవలం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఆ ఛానల్ కోటీ 20 లక్షల రూపాయలకు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేస్తున్నట్టు నిర్మాతతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక సందర్భంలో మాట్లాడుతూ కేవలం 2.5 లక్షలు ఈ సినిమాకు ఖర్చు చేశానని చెప్పారు.
ఆ విషయం తెలిసిన జెమినీ టీవీ యాజమాన్యం ఎక్కువ మొత్తానికి హక్కులను కొనుగోలు చేశామని భావించి డీల్ ను రద్దు చేసుకుంది. నిర్మాత జెమినీ ఛానల్ నిర్వాహకులకు హీరో హీరోయిన్, టెక్నీషియన్లు సినిమా సక్సెస్ అయ్యాక డబ్బులు తీసుకుంటామని చెప్పానని అవతలి వాళ్లు మాత్రం కేవలం పెట్టుబడి గురించి ఆలోచించి సినిమాను వదిలేశారని చెప్పుకొచ్చారు. నవదీప్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమా థియేటర్లలో విడుదలై డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.