మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రం ‘సీతారామం’ (Sita Ramam) . తెలుగులో స్ట్రైట్‌గా విడుదలైన ఈ చిత్రం ఇతర భాషల్లోనూ డబ్ అయ్యి మంచి స్పందన పొందింది. అయితే అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కాలేకపోవడంతో సినిమా లాంగ్ రన్‌లో 98.1 కోట్ల వద్ద ఆగిపోయింది. హిందీ రిలీజ్ ఆలస్యమైన కారణంగా, సినిమా 100 కోట్ల క్లబ్‌ను చేరలేకపోయింది. ‘సీతారామం’ తర్వాత దుల్కర్ తన సొంత ప్రొడక్షన్‌లో మలయాళంలో కింగ్ ఆఫ్ కోత అనే ఒక సినిమా చేశాడు,
కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. తరువాత తెలుగులో వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) తో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా 74 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మంచి టాక్‌తో రన్ అవుతోంది. కానీ ఈ సినిమాకు పోటీగా శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ‘అమరన్’(Amaran) , కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) సినిమాలు విడుదల కావడం కొంత ఇబ్బందిగా మారింది. అవి కూడా పాజిటివ్ టాక్ సంపాదించడం వల్ల ఈ సినిమా కలెక్షన్లలో కాస్త తేడా వచ్చింది.
‘లక్కీ భాస్కర్’ త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంతా ఆశిస్తున్నారు. కానీ నవంబర్ 14న సూర్య (Suriya) నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’ (Kanguva) విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాతో పాటు మరిన్ని థియేటర్లు ఆక్రమించుకునే అవకాశం ఉండటంతో లక్కీ భాస్కర్ కలెక్షన్ల రన్‌కు ప్రభావం పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, దుల్కర్ సెంచరీ కలని చేరుకోవడం కాస్త కష్టంగా మారేలా ఉంది. అయితే ఈ సినిమా దుల్కర్ కెరీర్‌లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ల చిత్రం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
తెలుగు ప్రేక్షకుల్లో తన స్థానం బలపడటంతో, దుల్కర్ (Dulquer Salmaan) వచ్చే ప్రాజెక్టులకు బిజినెస్ పరంగా మంచి ప్లస్ పాయింట్ కానుంది. తెలుగులో ‘సీతారామం’ హిట్ తర్వాత దుల్కర్‌పై భారీ అంచనాలు ఏర్పడడం, ప్రేక్షకులకు అతని స్టోరీ సెలక్షన్లపై నమ్మకం పెరగడం, అతనికి కొత్త అవకాశాలు తెచ్చి పెట్టింది. దుల్కర్ రానాతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు, అలాగే పవన్ సాదినేని దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.