‘బాహుబలి’ తర్వాత రాజమౌళి కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు తెలుసా? అదేంటి ‘ఆర్ఆర్ఆర్’ వచ్చింది, మహేష్‌బాబు సినిమా రాబోతోంది కదా. మరి కొత్త సినిమాలు ఒప్పుకోలేదని ఎందుకు అంటున్నారు అనే ప్రశ్న మీ నోటి చివర ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్టే, మేం చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చేయబోతున్న మహేష్ 29వ సినిమా, చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గతంలో ఎప్పుడో ‘బాహుబలి’ కంటే ముందే రాజమౌళి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో దానయ్య చెప్పిన ఓ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘బాహుబలి’ సిరీస్ తర్వాత డీవీవీ దానయ్య నిర్మాతగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేయడం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్‌ను రాజమౌళి ఇప్పుడు ఈ భారీ చిత్రం ద్వారా నెరవేర్చారని తర్వాత తెలిసింది. అయితే ఈ సినిమా కంటే ముంఏ దానయ్య – రాజమౌళి ఓ సినిమా చేయాల్సిందట. ఆ సినిమా ఒప్పుకునుంటే దానయ్య నిర్మాణ సంస్థ రికార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
సినిమా కోసం రాజమౌళికిఅడ్వాన్స్ ఇచ్చి చాలా ఏళ్లయిందని దానయ్య చెప్పారు. ‘మగధీర’ సినిమా తర్వాత రాజమౌళి ‘మర్యాదరామన్న’ అనే సినిమా చేసే సమయంలో దానయ్యతో మాట్లాడారట. మీరు గతంలో అడ్వాన్స్ ఇచ్చారు కదా.. దాంతో ‘మర్యాద రామన్న’ సినిమా చేస్తారా అని అడిగారట. అయితే రాజమౌళితో పెద్ద సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమా రిజెక్ట్ చేశానని దానయ్య చెప్పారు. అప్పుడా సినిమా వద్దనక పోయుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి పెద్ద సినిమా మిస్ అయ్యేదని దానయ్య చెప్పారు.
మీతో సినిమా చేయడానికి టైమ్ పడుతుంది అని చెప్పినా.. ఆగడంతో ఈ సినిమా వచ్చింది అని చెప్పారు దానయ్య. సుమారు రూ. 450 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఆ అవార్డు ప్రచారానికి సంబంధించి తానేమీ ఖర్చు పెట్టలేదని దానయ్య చెప్పారు. రాజమౌళి ఏం చేశారో తనకు తెలియదు అని కూడా చెప్పారు.