‘కాష్మోరా’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తీ. సినిమా పేరులో భయం ఛాయలుండటంతో సినిమా కూడా అలానే ఉంటుందనుకున్న ప్రేక్షకులు థియేటర్లో అడుగుపెట్టగానే నవ్వటం మొదలెట్టారు. దాంతో ఈ సినిమా టీమ్ మొహాల్లోనూ అదే నవ్వు కదలాడుతోందిప్పుడు. ‘ఊపిరి’తో తొలిసారి ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రం చేసిన కార్తీ మళ్ళీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు.”ద్విభాష చిత్రం అన్ని సార్లు కుదరదు. అందరికీ నచ్చే కథలు కొన్నే ఉంటాయి. వాటిని మాత్రమే ద్విభాషా చిత్రాలుగా చేయగలం. అప్పుడు కూడా ప్రతిభావంతులైన రచయితలు రెండు పరిశ్రమల్లోనూ ఉండాలి. భావం పోకుండా ఒకే మాటని రెండు రకాలుగా చెప్పే నేర్పు ఉండాలి. అన్నిటికీ మించి ఒకే భావోద్వేగాన్ని రెండు సార్లు పలికించడం అంత తేలికైన విషయం కాదు” అని చెప్పుకొచ్చిన కార్తీ తన తర్వాతి సినిమాల గురించి చెబుతూ మణిరత్నంతో చేస్తున్న సినిమా పూర్తి కావొచ్చిందన్నాడు.
ఇందులో మిలటరీ అధికారిగా కనపడనున్న తాను తర్వాతి సినిమాలో పోలీస్ గా నటించనున్నట్టు చెప్పుకొచ్చాడు.మణిరత్నం సినిమా అనుభవాలను పంచుకుంటూ “ఆయన దర్శకత్వంలో నటిస్తుంటే.. గతంలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన రోజులు గుర్తొస్తున్నాయ”న్నాడు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో తేడాలేమైనా ఉన్నాయంటే.. “ఆయన ఆలోచనలు ఎప్పుడూ పదేళ్ల ముందుంటున్నాయన్న కార్తీ సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు నా మాట వినేవారు కాదు. ఇప్పుడు హీరోను గనక వుంటున్నా”రంటూ చమత్కరించాడు. కెప్టెన్ కుర్చీ ఎక్కే ఆలోచనుందా అన్నదానికి బదులుగా ఇప్పుడు నటనను ఆస్వాదిస్తున్నా. భవిష్యత్తులో మనసుపుడితే చెప్పలేం అంటూ ముగించాడు.