కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కె.ఆర్.కె. ఇటీవల కాలంలో ఇతని పేరు ఎక్కువగానే వినుంటారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిలీజ్ టైంలో.. ‘అది ఒక చెత్త సినిమా అని.. రాజమౌళిని అరెస్ట్ చేయాలని’ ట్వీట్ చేయడమే కాకుండా ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రం రిలీజ్ అయ్యాక అది ‘ఆర్.ఆర్.ఆర్’ ను మించిన చెత్త సినిమా అని అందుకు ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలి అన్నట్టు విమర్శించాడు ఇతను. దీంతో ఇతన్ని తిట్టుకొని తెలుగు ప్రేక్షకులు అంటూ లేరనే చెప్పాలి.
మన తెలుగు వాళ్ళు అనే కాదు బాలీవుడ్ జనాలు కూడా ఇతన్ని తెగ తిట్టుకుంటూ ఉంటారు.ఒకప్పుడు సినిమాల్లో నటించేవాడు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఫేడౌట్ అయిపోయాక క్రిటిక్ గా మారి ప్రతి సినిమాని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తూ ఉంటాడు. సినిమాని చూసి ‘విశ్లేషించడానికి, విమర్శించడానికి వ్యత్యాసం కూడా ఇతనికి తెలీదా?’ అనే అనుమానం ఇతని రివ్యూలు చూస్తే ఎవరికైనా కలుగుతుంది. ఏకంగా సల్మాన్ ఖాన్ కూడా ఇతని పై కేసు వేసాడంటే అర్ధం చేసుకోవచ్చు.
‘రాధే’ సినిమాని ఇతను బాలేదు అనే మాటతో సరిపెట్టకుండా ఇష్టమొచ్చినట్టు విమర్శించాడు. దీంతో సల్మాన్ ఖాన్ ఇతని పై కేసు వేయడం జరిగింది. అంతే కాదు అంతకు ముందు మనోజ్ బాజ్ పాయ్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ను ‘సాఫ్ట్ పోర్న్’ సిరీస్ అంటూ కె.ఆర్.కె విమర్శించాడు. చాలా హిట్టు సినిమాలను ఇతను ఘోరంగా విమర్శించిన సందర్భాలు అనేకం.
మొత్తానికి ఇతని పై పెట్టిన కేసులకు గాను ముంబై ఎయిర్ పోర్టులో ఇతన్ని అరెస్ట్ చేశారు మలద్ పోలీసులు. ఈరోజు అతన్ని బోరివలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అవ్వడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.