భారతీయ సినిమా ప్రపంచాన్ని, సంగీత లోకాన్ని శోక సముద్రంలో ముంచేశారు ప్రముఖ గాయకుడు పంజక్ ఉదాస్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. తన గాత్ర మాధుర్యంతో ఐదు దశాబ్దాలు పాటు రంజింపజేశారు పంకజ్ ఉదాస్. 1951లో గుజరాత్‌లోని జెత్‌పుర్‌లో ఓ సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. పంకజ్ అన్నయ్య మనోహర్ ఉధాస్ బాలీవుడ్‌లో పేరున్న నేపథ్య గాయకుడు. ఆయన దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దారు పంకజ్.
ఇండి – పాప్ గీతాలతో కెరీర్‌ని ప్రారంభించిన పంజక్ ఉదాస్… ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నారు. గజల్స్ ఆలపించడం ప్రారంభించాకే ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తన మధురమైన గాత్రానికి ఉర్దూ సాహిత్యం మేళవించి పాడిన గజల్స్ శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక 1980లో ‘ఆహత్’ పేరుతో తొలి గజల్ ఆల్బమ్ విడుదల చేసిన పంకజ్ మొత్తంగా 60 ఆల్బమ్‌లు ఆలపించారు. ఇతర గాయకులతో కలిసి కూడా ఆయన పాటలు పాడారు.
ఉర్దూ సాహిత్యంపై పంకజ్‌కు ఉన్న పట్టుతో గజల్స్‌ని సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకు రాగలిగారు. ఆయన ఓ దశలో గజల్ సంగీత ప్రపంచంలో మకుటంలేని మహరాజుగా వెలుగొందారు అని చెప్పాలి. ఫిలిం ఫేర్ అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. ఇక పంకజ్ పేరు చెప్పగానే.. ‘చిట్టీ ఆయీ హై..’, ‘ఔర్ ఆహిస్తా కీజియే బాతే..’ లాంటి పాటలు గుర్తొస్తాయి. ‘నామ్’, ‘సాజన్’, ‘మోహ్రా’ తదితర బాలీవుడ్ సినిమాల్లో ఆయన పాటలు ఆలపించారు. బాలీవుడ్ హిట్ సినిమాల్లోనూ ఆయన పాడారు.
పంజక్ (Pankaj Udhas) మరణ వార్తను ఆయన తనయ నాయబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘‘దిగ్గజ గాయకుడు, మా నాన్న పంకజ్ ఉదాస్ అస్తమించారనే విషయాన్ని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను’’ అంటూ నాయబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. దీంతో సంగీత ప్రపంచం, బాలీవుడ్ సినిమాలు జనాలు ఎమోషనల్ అయ్యి… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.