సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘బజరంగీ భాయిజాన్’ సినిమా చూశారా? అందులో మున్నీ అలియాస్ షాహీదా గుర్తుందా? సినిమాలో బధిర చిన్నారిగా ఆ పాత్ర చాలాకాలం సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, మంచి స్క్రీన్ ప్రజెన్స్‌తో నటించిన ఆ చిన్నారి ఇప్పుడు తెలుగులో సినిమాలో నటిస్తోంది. సుమారు పదేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వస్తోంది. ఆమెను సినిమాల్లోకి మళ్లీ తీసుకొస్తోంది ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) టీమ్. ఈ సినిమాలో ఆమెను తీసుకున్నట్లు టీమ్ ప్రకటించింది.
ఇంత చెప్పి పేరు చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు చెప్పం.. అప్పుడు చిన్నారిగా, ఇప్పుడు యువతిగా తన అందంతో సోషల్ మీడియాను కూడా ఓ ఊపు ఊపేస్తున్న ఆమె పేరు హర్షాలీ మల్హోత్రా. బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాలో త్వరలో హర్షాలీని చూడొచ్చు. ఇందులో జననిగా కనిపించబోతోంది. అంటే తొలి పార్టులో బేబీ దేశ్న జవాజీ నటించి కూతురు పాత్రలో అన్నమాట.
ముంబయికి చెందిన హర్షాలీ మల్హోత్ర బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. హిందీలో ‘కుబూల్ హై’, ‘లవుట్ ఆవో త్రిష’ అనే సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత 2015లో విడుదలైన ‘బజరంగీ భాయిజాన్’లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల వైపు కానీ, సీరియళ్ల వైపు కానీ రాలేదు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకున్నాక సినిమాల్లోకి వస్తోంది అని సమాచారం. మరి ఎలా నటిస్తోంది, ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
ఇక ‘అఖండ 2: తాండవం’ సంగతి చూస్తే.. దైవిక అంశాలతో ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. 2021లో వచ్చి మంచి విజయం సాధించిన ‘అఖండ’ సినిమాకు ఇది కొనసాగతింపు. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా సందర్భంగా సెప్టెంబరు 25న విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసేశారు.