చిరంజీవి లాంటి మాస్ హీరోకు హీరోయిన్, పాటలు, డ్యాన్స్‌లు, స్టెప్పులు, కామెడీ లేకపోతే కష్టమే. ఈ అంశాలు లేకుండా సినిమా చేయడం అంటే.. ఫ్లాప్‌ని కోరుండి ఆహ్వానించడమే! ఈ మాటలు ఎక్కడో విన్నట్లుంది ఉంది కదా. ఇంకెక్కడ.. మొన్నామధ్య ‘ఆచార్య’ సినిమా విడుదలై దారుణ పరాజయం పొందాక కొంతమంది సినిమా నిపుణులు అన్న మాటలివి. వారు చెప్పినదాంట్లో కాస్త నిజం లేకపోలేదు. అయితే మొత్తంగా అదే నిజం కాదు అని ‘గాడ్‌ఫాదర్’ నిరూపించింది.
చిరంజీవి అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే డ్యాన్స్, ఫైట్స్, కామెడీ.. ‘గాడ్‌ఫాదర్’లో లేవు. అంతకుముందు వచ్చిన ‘ఆచార్య’లోనూ లేవు. కానీ ‘ఆచార్య’ ఫలితాన్ని ఎడమ కాలితో తన్నుతూ ‘గాడ్‌ఫాదర్’ భారీ విజయం అందుకుంది అంటున్నారు. దీనికి కారణం చిరంజీవిని చూపించాల్సిన విధానంలో చూపించాలి కానీ.. ఫైట్స్, డ్యాన్స్, కామెడీ కాదు అని అంటున్నారు. ‘గాడ్‌ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజా చేసింది, ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివ చేయనది అదే అంటున్నారు.
‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవి చాలా ఎక్కువగా మాట్లాడాడు. అదేంటి పొదుపుగా మాట్లాడాడు కదా అంటారా? మీరన్నది నిజమే. అయితే ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడింది గొంతు కాదు, కళ్లు. అవును, చిరంజీవి ఈ సినిమాలో చాలావరకు కళ్లతోనే మాట్లాడతాడు. విలన్ సత్యదేవ్‌తో చిరంజీవి ఫేస్ ఆఫ్, మైండ్ గేమ్ అంతా కళ్లతోనే నడుస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక సీన్ చెప్పొచ్చు. చిరంజీవిని అక్రమంగా జైల్లో పెట్టించాక.. సత్యదేవ్ వచ్చి కలుస్తాడు.
సెల్‌లోకి సునాయాసంగా వచ్చి వార్నింగ్ ఇచ్చి.. రిటర్న్ వెళ్లిపోబోతాడు. అప్పటివరకు తన మనిషిగా ఉన్న జైలర్.. డోర్ తీయడు. ఏమైందా అని సత్యదేవ్‌తో సహా, థియేటర్‌లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు చిరంజీవి నుండి చిన్న కనుసైగ వస్తుంది. దాంతో డోర్ తీస్తారు ఆ జైలర్. ఈ సీన్‌కి థియేటర్‌లో ఈల వేయని, చప్పట్లు కొట్టని అభిమానులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సీన్స్ సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి.
‘ఆచార్య’కు, ‘గాడ్‌ఫాదర్’కి తేడాల్లో ఇదే ముఖ్యమైన తేడా. సినిమా చూసే ప్రేక్షకులు కానీ, అభిమాని కానీ.. హీరో ఎంతసేపు హైలో ఉండాలి. ‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవి ఆ పని చేతలతో కంటి చూపుతో చేసేశాడు. కాబట్టి.. కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్న చిరంజీవికి కొత్తదనం ఇవ్వాలి. అది దర్శకులు, రచయితల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అలాంటి పాత్రలు చేయడానికి చిరంజీవి ఎప్పుడూ రెడీయే.