1986లో రూపొందిన “లేడీస్ టైలర్”కు సీక్వెల్ గా రూపొందిన చిత్రం “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్”. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించగా.. మానస హిమవర్ష-మనాలి రాధోడ్-అనీషా ఆంబ్రోస్ లు కథానాయికలుగా నటించారు. మరి ఒరిజినల్ సినిమా స్థాయిలో సీక్వెల్ కూడా అలరించిందో లేదో చూద్దాం.
కథ : గోపాళం (సుమంత్ అశ్విన్) గోదారి తీరాన ఓ కుగ్రామంలోని ఫ్యాషన్ డిజైనర్. అందరితో సరదాగా వ్యవహరించే గోపాళానికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అదంతా తన చేతికి ఉన్న “మన్మధ రేఖ” పుణ్యమని తెలుసుకొంటాడు గోపాళం. ఆ మన్మధ రేఖను వాడుకొని.. ఆ ఊర్లోని బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేసి.. ఆమెను పెళ్లాడి, ఆమె ద్వారా వచ్చిన డబ్బుతో ఓ బట్టల షాపు పెట్టాలన్నది గోపాళం గోల్. అందుకోసం మొదట గేదెల రాణి (మానస హిమవర్ష), తర్వాత అమ్ములు (మనాలి రాథోడ్), అనంతరం మహాలక్ష్మి (అనీషా ఆంబ్రోస్)లను ప్రేమిస్తాడు. ఒకరిని మించిన డబ్బు మరొకరి వద్ద ఉందని భావించి.. అలా వరుసబెట్టి అందరికీ తన మన్మధ రేఖ ప్రభావం చూపుతూ పోతాడు. కట్ చేస్తే.. ఈ ముగ్గురి వెనుక ఉన్న ఊరి పెద్ద గవర్రాజు, గోపాళం ప్రాణానికే కాక ప్రేమకథలకు అడ్డంకిగా మారతాడు. చివరికి గోపాళం ఎవర్ని పెళ్లి చేసుకొన్నాడు, గవర్రాజు కారణంగా గోపాళం ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” కథాంశం.
నటీనటుల పనితీరు : సుమంత్ అశ్విన్ నటన పరంగా వంశీగారి శైలికి తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు మరియు పాటల వరకూ పర్లేదు కానీ.. మిగతా చోట్ల బాబు తేలిపోయాడు. వంశీ స్టైల్ ను తన యాక్టింగ్ తో రీప్రెజంట్ చేయలేక నానా ఇబ్బందులూ పడ్డాడు. గేదెల రాణి పాత్రలో మానస హిమవర్ష, అమ్ములుగా మనాలి రాథోడ్, మహాలక్ష్మి పాత్రలో అనీషా ఆంబ్రోస్ లు వంశీ మార్క్ బట్టల్లో అందాల ఆరబోతతో మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్నారు. అయితే.. పెర్ఫార్మెన్స్ విషయంలో ముగ్గురూ దారుణంగా ఫెయిల్ అవ్వడం మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఇబ్బందిపెడుతుంది. బట్టల సత్యం కొడుకు పండు పాత్రలో శ్రీనివాస్ కాస్తంత నవ్వించాడు కానీ.. అది కూడా వంశీ మార్క్ టిపికల్ యాంగిల్స్ వల్ల కావడంతో.. పంచ్ డైలాగ్ ను ఎంజాయ్ చేసేలోపు ఆ చిత్రమైన కెమెరా భంగిమలు కాస్తంత చిరాకుపెడతాయి. కృష్ణ భగవాన్ సింగిల్ లైన్ పంచ్ లు, ఇరికించిన కామెడీ సన్నివేశాలు చూసి ప్రేక్షకుడు నవ్వే రోజులు ఎప్పుడో పోయాయ్ కాబట్టి ఇకనైనా వంశీగారు ఆ తరహా కామెడీ సీన్లు రాయడం మాని కాస్త అప్డేట్ అవ్వడం సబబు.
సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ సంగీతం-నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. కొన్ని పాటలు మణిశర్మ పాత పాటల్ని గుర్తు చేసినా.. సెలయేరుకు తడిసిన మృదంగం చేసే సవ్వడిలా మృధువుగా అనిపించాయి. నేపధ్య సంగీతమూ సన్నివేశానికి బాగా యాప్ట్ అయ్యింది. “పెళ్ళిచూపులు” ఫేమ్ నాగేష్ బెన్నెల్ వంశీ మార్క్ ను తన కెమెరా కంటితో చక్కగా ఎలివేట్ చేశాడు. “పాపికొండల్లో..” పాట చిత్రీకరణ బాగుంది. అలాగే గోదావరి అందాలను ఇంకాస్త అందంగా ప్రెజంట్ చేసిన విధానమూ గోదావరి జనాలను విశేషంగా ఆకట్టుకొంటుంది. మాటలు మొదలుకొని పాటలు, సన్నివేశాల చిత్రీకరణ, సీన్స్ కంపోజింగ్ అన్నిట్లోనూ వంశీ మార్కే కనిపించడంతో.. ఎడిటర్, రైటర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేకుండాపోయింది.
“ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” సినిమా చూశాక.. వంశీగారు ఇంకా 1980 దగ్గరే ఆగిపోయారనిపిస్తుంది. 2002లో వచ్చిన “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” హిట్ తో ఆయన కాస్త అప్డేట్ అయ్యారనిపించినా.. ఈ సినిమా చూశాక “అబ్బే లేదండీ.. ఆయనేం మారలేదు.. ఆయ్” అని సగటు ప్రేక్షకుడు అనుకోక మానడు. 1980లోనే తన సినిమాల్లో శృంగార రసం ఎక్కువగా ఉంటుంది, అయితే అది హృద్యంగానే ఉంటుంది అంటూ “లేడీస్ టైలర్” గురించి ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న వంశీగారు.. 2017కు వచ్చేసరికి ఆ హృద్యతను పక్కన పెట్టేసి.. హీరోయిన్ల నుండి లీటర్ల కొద్దీ శృంగార రసాన్ని రాబట్టడానికే మొగ్గుచూపారనిపిస్తుంది. శృంగార రసం పండించే విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆయనకు చెప్పేటంతటోళ్ళం కాకపోయినా.. ఈతరానికి ఆయనకంటే చులకనభావం ఏర్పడడం ఇష్టం లేని ఓ సినిమా అభిమానిగా వంశీగారు కాస్త బూతు తగ్గించాలని మాత్రం ఆశిస్తున్నాం.
విశ్లేషణ : మారుతి తీసే సినిమాలను చూసి “బూతు సినిమాలు” అని స్టాంప్ వేసిన జనాలు వంశీ గారి సినిమాలు చూసి కళాత్మకం అనడం ఏమాత్రం సబబు కాదు. సో, “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” వంశీ తీసిన ఓ బూతు సినిమా అని పేర్కొనడంలో తప్పులేదు. ఈ బూతుని ఎంజాయ్ చేయాలంటే.. శృంగార రసం కోసం పరితపించేవాడైనా ఉండాలి లేదా బూతు చిత్రాలను ఆస్వాదించేవారైనా ఉండాలి.