సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడని నెలలు ఏవి అంటే.. ఫిబ్రవరితో స్టార్ట్ చేసేవారు ఆ లిస్ట్‌ని. నెలల జాబితాలో తొలుత ఉంటుందని కాదు.. సంక్రాంతి సీజన్ అయిన వెంటనే వస్తుంది కాబట్టి. అప్పటికే వరుస సినిమాలను జనాలు చూసుంటారు.. మళ్లీ ఆ తర్వాతి నెలలోనూ సినిమాలా అని అనుకుంటూ ఉంటారు. దానికి తోడు పరీక్షలు దగ్గరికొస్తుంటాయి కాబట్టి సినిమాలెందుకు అనుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఫిబ్రవరిలోనూ వరుస సినిమాలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. రెండో నెలలో వారానికో ఆసక్తికర సినిమా బాక్సాఫీసు వద్దకు రాబోతున్నాయి. ఆ సినిమాల లెక్క చూస్తుంటే.. ఫిబ్రవరి అనే వర్రీని నిర్మాతలు వదిలేసినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి వద్దాం అనుకుని రాలేకపోయిన సినిమాలు, సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు.. తర్వాత చూద్దాంలే అనుకున్న సినిమాలు ఫిబ్రవరికి వస్తున్నాయి. అలా వచ్చే ఏడాది ఫిబ్రవరి లిస్ట్‌లో కొన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి.
మరికొన్ని మీడియం స్టార్ హీరోల సినిమాలున్నాయి. సమంత – గుణశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. త్రీడీలో సినిమా రూపొందుతుండటంతో.. ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డేట్ చెప్పలేదు కానీ.. వాలెంటైన్స్ డేకానుకగా రావొచ్చు అని టాక్. ఇక ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ను కూడా ఫిబ్రవరికి వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమా డిసెంబరులోనే రావాలి. అయితే అనుకున్నట్లుగా షూట్ సాగక సినిమా రెండో నెలకు వెళ్లిపోయింది.
వీటితోపాటు డిసెంబరులో రావాల్సిన మరో సినిమా కల్యాణ్‌రామ్ ‘అమిగోస్’ను కూడా రెండో నెలకు తీసుకెళ్లిపోయారు. వీటితోపాటు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇవి కాకుండా సంక్రాంతికి అనుకుంటున్న అఖిల్ – సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ ఫిబ్రవరి తొలి వారానికి వెళ్తోందట. ఇదంతా చూస్తుంటే.. నిర్మాతల్లో ఫిబ్ర‘వర్రీ’ పోయినట్లే కనిపిస్తోంది. అయితే వసూళ్లు బాగా వస్తే పూర్తిగా ఆ వర్రీ పోతుంది అని చెప్పాలి.