“క్రాక్” జనవరిలో ఫుల్ ఎనర్జీని నింపుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫిబ్రవరిలో విడుదలల విషయంలో రచ్చ చేసింది. దాదాపు 29 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ 29లో ప్రేక్షకులకు పరిచయం లేని సినిమాల సంఖ్య ఎక్కువ అనుకోండి. అయితే.. ఫిబ్రవరి నిర్మాతలకు ఓ మోస్తరుగా బాగానే వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే.. ఫిబ్రవరిలో విడుదలైన “ఉప్పెన” ఏకంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 50 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు.
దేవి శ్రీప్రసాద్ సంగీతం, కృతిశెట్టి గ్లామర్, బుచ్చిబాబు దర్శకత్వం ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే.. అల్లరి నరేష్ తో గత 8 ఏళ్లుగా దొబూచులాడుతున్న విజయం ఎట్టకేలకు ఆయన్ను కౌగిలించుకుంది. అల్లరి నరేష్ నటించిన విభిన్న చిత్రం “నాంది:” కమర్షియల్ హిట్ గా నిలవడమే కాక నరేష్ లోని నటుడ్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “జాంబీ రెడ్డి” కూడా కమర్షియల్ హిట్ జాబితాలో చేరింది.
మంచి అంచనాలతో విడుదలైన “చెక్” ఫ్లాప్ అయ్యింది. చెక్ తోపాటు జగపతిబాబు నటించిన “ఎఫ్ సీ యు కె”, సుమంత్ నటించిన “కపటధారి”, విశాల్ “చక్ర” కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. దాంతో ఫిబ్రవరి నెల ఒక బ్లాక్ బస్టర్, రెండు కమర్షియల్ హిట్స్, బోలెడన్ని ఫ్లాపులు, డిజాస్టర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి మార్చి ఎలా ఉంటుందో చూద్దాం.