అంతా సద్దుమణిగింది.. పొంగల్‌కి సినిమాల ఇండస్ట్రీల మధ్య ఫైట్ లేదు.. కేవలం సినిమాల మధ్యే ఫైట్ అనుకుంటున్నారు. హీరోల ఫ్యాన్స్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అంతా అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ మళ్లీ ముందుకు వచ్చింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. దసరా, సంక్రాంతి పండగ రోజుల్లో తెలుగు సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ రాసింది.
సంక్రాంతి బరిలో తెలుగుతోపాటు తమిళ అగ్ర హీరోల సినిమాలు విడుదలకానున్న నేపథ్యంలో ఈ మేరకు అసోసియేషన్‌కు ఛాంబర్ కీలక సూచనలు చేసింది. 2017లో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ… సంక్రాంతి, దసరాకు తెలుగు చిత్రాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎగ్జిబిటర్లందరూ ఈ సూచనలు ఫాలో అవ్వాలని సూచించింది. అయితే ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇదే విషయంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే.
వచ్చే సంక్రాంతికి చిరంజీవి – బాబి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ‘వీర సింహారెడ్డి’ బరిలో నిలవనున్నాయి. వీటితోపాటు తమిళ చిత్రాలు విజయ్ ‘వరిసు’, అజిత్ ‘తునివు’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘వరిసు’ / ‘వారసుడు’, ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న రిలీజ్ కానున్నాయి. మిగిలిన సినిమాల విడుదల తేదీలు ఇంకా తెలియలేదు. అయితే నాలుగు సినిమాలు ఒకేసారి రావడం అన్నింటి నిర్మాణ సంస్థలు పెద్దవి కావడంతో థియేటర్ల దగ్గర ఇబ్బంది వస్తోంది.
ఈ విషయాన్ని గ్రహించే అప్పుడు నిర్మాతల మండలి, ఇప్పుడు ఛాంబర్ తెలుగుకే ప్రాధాన్యం అంటున్నాయి. దానికి 2017లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, ఆలోచనను నేపథ్యంగా చెబుతున్నాయి. అయితే దిల్ రాజు మాత్రం వెనుక చాలా లెక్కలున్నాయని, త్వరలో అందరికీ చెబుతాను అని అంటున్నారు. నిర్మాతల మండలి మాటలను దిల్ రాజు అండ్ కో. పెడచెవిన పెడుతున్నారు. మరి ఇప్పుడు ఛాంబర్ మాటకు ఎంత విలువ ఉంటుందో చూడాలి.