ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం‘ లోని గీతం కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది.
‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం
‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం ఈరోజు విడుదల అయింది.
నాయిక వర్ష బొల్లమ్మతో
“నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా…నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా” అంటూ పాటందుకున్న నాయకుడు ‘గణేష్‘. ఈ వీడియో చిత్రం లో కనిపిస్తారు.
చిత్ర హీరో, హీరోయిన్ గణేష్, వర్ష బొల్లమ్మ లపై పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కల్ మంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం. గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది.
పాట విడుదలైన క్షణం నుంచే అది ఆకట్టుకుంటున్న వైనం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్.
ప్రతి పాట కు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది. అలాగే ఈ పాటలో “ఓ.. తారల్ని మూట కడతా
నీ కాలి ముందు పెడతా
అరె.. చందమామ కి నీకూ తేడా లేదుగా
మబ్బుల్ని తెచ్చి కుడతా
రెక్కల్ని చేసి పెడతా
మేఘాలు దాటి పదా
ఆ ఆకాశం అంచుకే చేరదాం” అనే పదాలు , పాట పల్లవి నాకెంతో ఇష్టం అన్నారు రచయిత
కె కె.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారం ఊపందుకుంటోంది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం’స్వాతిముత్యం’. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు లక్ష్మణ్ అని తెలిపారు. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు విడుదల అయిన తక్షణమే ఈ గీతం కూడా ఆకట్టుకుంటోంది.