అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొత్త కొత్త మోసాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.. బ్యాంక్ ఖాతాలో సొమ్ము కాజెయ్యడం దగ్గరి నుంచి. సెలబ్రిటీల పేరు చెప్పి ఘరానా మోసాలకు పాల్పడడం వంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి.. జరుగుతున్నాయి.. తాజాగా పాపులర్ యాంకర్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు కొందరు వ్యక్తులు.. దీంతో మోసపోయిన వ్యక్తి నేరుగా ఈ విషయాన్ని శివ జ్యోతి దృష్టికి తీసుకెళ్లాడు.. వివరాల్లోకి వెళ్తే..
హుస్సేన్ అనే యువకుడికి శివ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయి అని టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ వచ్చింది.. హుస్సేన్, రెగ్యులర్‌గా శివ జ్యోతి వీడియోలను ఫాలో అవుతుంటాడు.. దీంతో నిజంగానే రివార్డ్ పాయింట్స్ వచ్చాయనుకున్నాడు.. ఆనందంగా ఆ లింక్ క్లిక్ చేశాడు.. కట్ చేస్తే.. ఈ రివార్డ్స్ అందుకోవాలి అంటే రూ. 1000 కట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు.. వారు చెప్పినట్లుగానే హుస్సేన్ డబ్బులు ఇచ్చాడు..
తర్వాత మళ్లీ ఇంకో పేరు చెప్పి మరో మూడు వేలు కట్టమన్నారు.. అది మోసం అని తెలియని హుస్సేన్.. మళ్లీ డబ్బులు వేశాడు.. దొరికాడు రా బకరా అనుకున్న సైబర్ నేరగాళ్లు.. మరో ఆరు వేలు కట్టమన్నారు.. ఇంకా అదే జోష్‌లో ఉండడంతో ఆ డబ్బు కూడా వేశాడు.. ఇక్కడికి రౌండ్ ఫిగర్ పది వేలు అయింది.. ఆ తర్వాత హుస్సేన్.. నా రివార్డ్ పాయింట్స్ ఏవి? అని ప్రశ్నించగా.. అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు..
మనోడికి అప్పుడు జ్ఞానోదయం అయింది.. మోసపోయానని తెలుసుకున్న హుస్సేన్.. పూర్తి వివరాలతో పాటుగా తన సెల్ నంబర్ యాంకర్ శివ జ్యోతికి పంపాడు.. దీంతో ఈ మోసంపై స్పందించిందామె.. హుస్సేన్ పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.. ‘అభిమానులు దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి, నాకు అసలు టెలిగ్రామ్ అకౌంటే లేదు’ అంటూ వివరణ ఇచ్చిందామె..