ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం “జార్జ్ రెడ్డి”. ఓయూ స్టూడెంట్ లీడర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి “దళం” ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. జార్జ్ రెడ్డిగా “వంగవీటీ” ఫేమ్ సందీప్ మాధవ్ నటించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 22) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: చిన్నప్పట్నుంచి తల్లిదండ్రుల సపోర్ట్ తోపాటు భగత్ సింగ్ మీద ఉన్న అభిమానంతో ఎగ్రెసిగ్ గా పెరుగుతాడు జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్). చదువుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగిడిన జార్జ్ రెడ్డికి అక్కడ కులం, మతం, స్థాయిని బట్టి మనిషికి వేల్యూ ఇచ్చే విధానం నచ్చవు. అలా అణగదొక్కబడుతున్న విద్యార్ధుల గళంలా మారతాడు జార్జ్ రెడ్డి. ఆ గళాన్ని తోక్కేయడం కోసం రాజకీయ, సాంఘిక శక్తులు చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నాల్ని జార్జ్ రెడ్డి & ఫ్రెండ్స్ ఎలా తిప్పికొట్టారు? చివరికి ఎవరు గెలిచారు? అనేది “జార్జ్ రెడ్డి” కథాంశం.
నటీనటుల పనితీరు: లుక్స్, మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ ఇలా ప్రతి విషయంలోనూ జార్జ్ రెడ్డిని తెరపై రీప్రెజంట్ చేశాడు. జార్జ్ రెడ్డి ఇలాగే ఉండేవాడేమో అని అనుకునే రేంజ్ లో సందీప్ జీవించేశాడు. అయితే.. జార్జ్ రెడ్డి అంటే కేవలం కోపం, ఆవేశం మాత్రమేనా. జార్జ్ రెడ్డి అంటే ఒక ఆలోచన, ఒక మార్పు, ఒక ధేయ్యం. ఈ అంశాలను జార్జ్ రెడ్డి పాత్ర ద్వారా ఎలివేట్ చేయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. అందువల్ల జార్జ్ రెడ్డి ఆవేశం తెరపై అచ్చెరువుగొలుపుతుంది కానీ.. అతడి ఆలోచనాధోరణి ఎలా ఉండేది? అసలు అతడి ఆలోచనా ధోరణికి ఎక్కడ భీజం పడింది? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం లేకుండాపోయింది. ఒక క్యారెక్టర్ ఉంది కానీ.. క్యారెక్టరైజేషన్ మాత్రం మిస్ అయ్యింది.ముస్కాన్ పాత్ర కథనానికి స్పీడ్ బ్రేకర్ లో మధ్యలో వచ్చి ఒక పాట పాడి లేదా ఒక లుక్ ఇచ్చి వెళ్లిపోతుంది కానీ.. కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు.”పెళ్ళిచూపులు” ఫేమ్ అభయ్ బేతగంటికి ఈ చిత్రంలో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ లభించింది. కానీ.. ఆ అవకాశాన్ని అభయ్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయాడు. రౌద్రం పండించడం అంటే గట్టిగా అరవడమే అని ఫిక్స్ అయిపోయినట్లు.. ప్రతి సన్నివేశంలో గట్టిగా అరుస్తూ కనిపించాడు తప్పితే.. ఎక్కడా కూడా ఒక తన పాత్ర ద్వారా కానీ.. తన యాటిట్యూడ్ ద్వారా కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు.చైతన్యకృష్ణ, సత్యదేవ్ పాత్రలు కథకి చాలా హెల్ప్ అయ్యాయి. వారి లుక్స్ & పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం, సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలోని కంటెంట్ ను హైలైట్ చేసింది వీళ్ళిద్దరే. సురేష్ బొబ్బిలి పాటలు 90ల కాలాన్ని తలపించినా.. అంతలా గుర్తుంచుకొనే స్థాయి పాటలు మాత్రం లేవు. ప్రొడక్షన్ డిజన్ & ఆర్ట్ వర్క్ టీంను ప్రత్యేకంగా అభినందించాలి. 90ల కాలం నాటి డ్రెస్సింగ్ స్టైల్ ను, జీవన పద్ధతులను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. సినిమాలో బిగ్గెస్ట్ ఎస్సెట్ ఏదైనా ఉంది అంటే.. అది ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్.దర్శకుడు జీవన్ రెడ్డి.. సినిమా మొత్తంలో జార్జ్ రెడ్డిని ఒక స్టూడెంట్ లీడర్ గా చూపించడానికంటే ఎక్కువగా ఒక బాక్సర్ గా ఎక్కువగా ఎలివేట్ చేశాడు. ఒక మోటివ్, కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది కనిపించదు. రెండున్నర గంటల సినిమాలో ప్రేక్షకుడ్ని కదిలించే సందర్భం ఎక్కడా కనిపించదు. జార్జ్ రెడ్డి ఆవేశాన్ని తెరపై చూపించాడు కానీ.. అతడి ఆలోచనను, అతడి గళాన్ని వినిపించలేకపోయాడు. ఒక కమర్షియల్ సినిమాగా జార్జ్ రెడ్డి బాగుండేదేమో కానీ.. ఒక బయోపిక్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోవడానికి కారణం దర్శకుడు జీవన్ రెడ్డి క్లారిటీ లేకుండా రాసుకున్న క్యారెక్టరైజేషన్స్,
విశ్లేషణ: జార్జ్ రెడ్డి గురించి ఏమాత్రం తెలియనివారు ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వలేరు.. ఆయన గురించి తెలిసినవారు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వలేరు. దాంతో జార్జ్ రెడ్డి ఒక బయోపిక్ గా అలరించలేక, ఒక కమర్షియల్ సినిమాగా ఆకట్టుకోలేక మధ్యస్తంగా మసిలిపోయింది.
రేటింగ్: 2/5