వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా దాదాపు మూడేళ్ళ తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రం “గని”. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కూడా తెలుగు డెబ్యూ చేసింది. పలుమార్లు పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: చిన్నప్పట్నుంచి బాక్సర్ అవ్వాలనే కసితో పెరిగిన కుర్రాడు గని (వరుణ్ తేజ్). తండ్రి చనిపోవడంతో తన ఆశయానికి అనుకోని అవరోధం ఎదురవుతుంది. వాటన్నిటినీ దాటుకొని గని ఎలా బాక్సర్ గా లైఫ్ లో గెలిచాడు? అనేది “గని” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇచ్చే వరుణ్ ఈ చిత్రంలోనూ బాక్సర్ గా తన బెస్ట్ ఇచ్చాడు. క్యారెక్టర్ కోసం తన పర్సనాలిటీని మలుచుకున్న విధానం ప్రశంసనీయం. ఫిజికల్ & మ్యానరిజమ్స్ తో అసలైన బాక్సర్ ను తలపించాడు వరుణ్. అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఎప్పట్లానే అదరగొట్టాడు వరుణ్. ఉపేంద్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఆయన సన్నివేశాలు సినిమాకి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
అలాగే ఆయన స్క్రీన్ ప్రెజన్స్ కూడా అదిరింది. హీరోయిన్ కి పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టరైజేషన్ లేదు. అలాగే ఆమె పెర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గ్లామర్ వైజ్ మాత్రం పర్లేదు. సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: బేసిగ్గా ఒక స్పోర్ట్స్ డ్రామాకి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఆ కనెక్టివిటీ “గని”లో కనిపించలేదు. ఉపేంద్ర సీన్స్ వరకు బాగా రాసుకున్న దర్శకుడు కిరణ్ వరుణ్ క్యారెక్టరైజేషన్ కు ఆ ఎమోషన్ ను కనెక్ట్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా వరుణ్ క్యారెక్టర్ ఆర్క్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. అలాగే సెకండాఫ్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లేలో పట్టు లేక కాస్త తడబడినప్పటికీ.. క్లైమాక్స్ లో ఆ తప్పులను తప్పించేశాడు కిరణ్ కొర్రపాటి. అలాగే సినిమా మొత్తాన్ని చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు కిరణ్. ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
సీన్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. చక్కగా తీసిన సీన్స్ ను సరిగా వినియోగించుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డాడు కిరణ్. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం బాగున్నాయి. ముఖ్యంగా గని ట్రైనింగ్ ఎపిసోడ్స్ ఇంటెన్సిటీని బాగా ఎలివేట్ చేశాయి. సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే.. తమన్నా సాంగ్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ టీం మాత్రం ది బెస్ట్ ఇచ్చారు.
విశ్లేషణ: వరుణ్ తేజ్ పడిన కష్టం, దర్శకుడు కిరణ్ కొర్రపాటి సీన్స్ కంపోజ్ చేసిన విధానం, ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ సీన్స్ & క్లైమాక్స్ ఎలివేషన్ కోసం సినిమాని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సినిమాని తప్పకుండా చూడాల్సిందే.