దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగునాట గొప్ప నటుడిగా, రచయితగా పేరు సంపాదించుకున్న గొల్లపూడి 1961లో వరంగల్ లోని హన్మకొండకి చెందిన శివకామసుందరిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. 2019 లో గొల్లపూరి మారుతీరావు అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి శివకామసుందరి వారి కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం 4 గంటలకు ఆమె మరణించినట్టు తెలుస్తోంది.
వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో శివకామసుందరి కన్నుమూశారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లి తరువాత మారుతీరావు ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. ఆ తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపిక కావడంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు.
ఆ తరువాత కొన్నాళ్లకు తర్వాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత మాటల రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు మారుతీరావు. దానికి కారణం తన భార్య సపోర్ట్ వలనే అని చెబుతుండేవారు.